వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో జూనియర్ మహిళా వైద్యురాలి జరిగిన హత్యాచార ఘటనపై ఆ రాష్ట్రంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుఖేందుర రే ట్వ్ చేసిన ట్వీట్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. తనకూ ఓ కుమార్తె ఉందని, మహిళలపై అఘాయిత్యాలు ఇక చాలంటూ ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దారుణాలపై మనమంతా కలిసి సంఘటితంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా, హత్యాచార కేసులోని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సాగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో ఆయన కూడా పాల్గొననున్నట్టు ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
'కోల్‌కతా మహిళా వైద్యురాలి హత్యాచారంపై జరుగుతున్న నిరసనల్లో నేను కూడా పాల్గొంటా. నిరసనకారులతో గొంతు కలుపుతా. ఎందుకంటే నాకూ ఓ కూతురు ఉంది. ఓ చిన్నారి మనవరాలు ఉంది. మహిళలపై జరుగుతున్న దారుణాలను మనమంతా సంఘటితంగా అడ్డుకోవాల్సిన సమయమిది' అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలా నిరసనల్లో పాల్గొంటే టీఎంసీ తనపై వేటు వేసే అవకాశం ఉందన్న కామెంట్లపైనా శేఖర్ స్పందించారు.
'పార్టీ ఎలాంటి చర్యలైనా తీసుకోనివ్వండి. నన్ను పార్టీ నుంచి తొలగించినా సరే, ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. నా తలరాత గురించి ఆందోళనపడకండి. ఎందుకంటే నా ఒంట్లో స్వాతంత్ర సమరయోధుడి రక్తం ప్రవహిస్తోంది. ఆందోళనలలో పాల్గొనడం వల్ల ఎదురయ్యే పరిణామాలపైన నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఏం జరిగినా సరే కోల్‌కతా వైద్యురాలికి జరిగిన దారుణంపై నిరసన తెలిపి తీరుతా' అని శేఖర్ స్పష్టం చేశారు.