సెక్యూరిటీగార్డు సహకరించలేదు.. చంపేశాం... కొడనాడు ఎస్టేట్ దోపిడీ దొంగల వాంగ్మూలం
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ చేసిన నిందితుల్లో కొందరిని తమిళనాడు సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. వారు ఇప్పటివరకు వెల్లడించిన వివరాల మేరకు ఓ పెద్ద తలకా
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ చేసిన నిందితుల్లో కొందరిని తమిళనాడు సీబీసీఐడీ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. వారు ఇప్పటివరకు వెల్లడించిన వివరాల మేరకు ఓ పెద్ద తలకాయ ఆదేశంమేరకు ఈ దోపిడీ చేయగా, కొడనాడు ఎస్టేట్‌లోకి జయలలిత కారు డ్రైవర్‌గా పనిచేసిన కనకరాజ్ తీసుకెళ్లినట్టు వెల్లడించారు. అసలు ఈ దోపిడీ ఎలా చేసిందో వారు పూసగుచ్చినట్టు వివరించారు.
ఈదోపిడీకి పాల్పడిన నిందితుల్లో షంషీర్ అలీ, జిత్తన్‌జాయ్‌లను కేరళలో అరె చేశారు. రెండు రోజుల క్రితం తమిళనాడు సీబీసీఐడీ బృందం షంషీర్ అలీ, జిత్తన్‌జాయ్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఈ నిందితులు వెల్లడించిన వివరాల మేరకు... కొడనాడు ఎస్టేట్ బంగళాలో దోపిడీకి వెళ్లిన తమకు, జయలలిత, శశికళ గదుల్లో సూట్‌కేసుల నిండుగా నోట్ల కట్టలు, దస్తావేజులు కనిపించాయన్నారు.
నిజానికి మేమంతా బైకులు, కార్లు దొంగతనాలు చేసే వాళ్లం. కనకరాజ్, సయాన్, మేమిద్దరం, మరో ఏడుగురు కలిసి ఈ దోపిడీలో పాల్గొన్నాం. కొడనాడు ఎస్టేట్‌లో మమ్మల్ని వాచ్‌మెన్‌లు ఓం బహదూరు, కృష్ణబహదూర్ ప్రతిఘటించారు. ఎంత డబ్బు ఇస్తామన్నా మాకు సహకరించడానికి నిరాకరించారు. జయ బంగళాలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. లక్షల రూపాయలు ఎరవేశాం. అయినా ససేమిరా అన్నారు. ఎంతచెప్పినా వినకపోవడంతో, ఇనుపరాడ్లతో దాడి చేశాం. గాయాలతో వారు పడిపోయాక, జయలలిత, శశికళ గదులల్లోకి వెళ్లాం.
అక్కడి పెద్ద సూట్ కేసులను తెరచి చూడగా కరెన్సీ కట్టలు, జయ వీలునామా, ఆస్తి పత్రాలు, ఆభరణాలు కనిపించాయి. చేతికందినంత వరకూ నోట్ల కట్టలను, నగలను ప్లాస్టిక్ బ్యాగ్‌లలో నింపుకొన్నాం. అంతా అయ్యాక, కనకరాజ్ మాకు రెండు లక్షలిచ్చాడు. అదేమంటే.. 'ఈ వ్యవహారంలో పెద్ద తలకాయలున్నాయ్, హద్దు మీరి డబ్బులడిగితే మీకే ముప్పు' అని బెదిరించాడు. చేసేదేమీలేక కనకరాజ్ ఇచ్చింది తీసుకొని కేరళ వెళ్లిపోయాం. ఎస్టేట్‌లోంచి బయటకు తెచ్చిన నగదు, ఆస్తులకు సంబంధించిన దస్తావేజులన్నీ కనకరాజ్‌కే అప్పగించాం' అని వారు వివరించారు.