డీఎంకే నుంచి కాంగ్రెస్ మీదుగా బీజేపీకి వెళ్లిన నటి ఖుష్బు మరోమారు తన నోటిదురదతో విమర్శలపాలైంది. దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కేసులు నమోదైన నేపథ్యంలో ఆమె బహిరంగ క్షమాపణ చెప్పారు.
ఇటీవల ఖుష్బూ కాంగ్రెస్ నుంచి వైదొలగి ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి చెన్నై తిరిగొచ్చిన ఖుష్బూ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... మతి స్థితిమితం లేని పార్టీ నుంచి వైదొలగానని ప్రకటించారు. ఆ మాటే ప్రస్తుతం ఆమె పాలిట శాపంగా మారింది.
ఖుష్బూ వ్యాఖ్యలు దివ్యాంగులను కించపరిచేలా ఉన్నాయంటూ దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు, దివ్యాంగుల సంరక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసుస్టేషన్లలో నమోదైన కేసులపై స్టే తెచ్చుకునేందుకు ఖుష్బూ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.