ఆళపుళ - కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం రాత్రి దారుణ ఘటన ఒకటి జరిగింది. తోటి ప్రయాణికుడిపై మరో ప్రయాణికుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఇద్దరు ప్రయాణికుల మధ్య ఏర్పడిన వివాదం కాస్త చిలికి చిలికి గాలివానలా తయారై ఈ ఘటనకు దారితీసింది. బాధితుడిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. వారిద్దరితో పాటు బాధితుడిన కూడా సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ జిల్లా ఎలాత్తూరులో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆళపుళ -కన్నూరు ఎక్స్‌ప్రెస్ రైలులో ఇద్దరు ప్రయాణికుల వద్ద వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధితుడుని కాపాడేందుకు ఇతర ప్రయాణికులు ప్రయత్నించి వారు కూడా గాయాలపాలయ్యారు. మరికొందరు ప్రయాణికులు రైలు చైను లాగారు. దీంతో రైలు వేగం తగ్గిపోవడంతో నిందితుడు బోగి దిగి పారిపోయాడు. బాధితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన పలువురు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ముగ్గురు మహిళలతో పాటు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. రైల్లోని డీ1 బోగీలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.