కావేరి గొడవ... అటు కాకి ఇటు వాలట్లేదు... పెళ్లికూతురుకు నో వెహికల్... తనవాడికోసం నడిచింది...
కావేరీ జలాల వివాదంపై ఇరు రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగడం ఓ నవ వధువు పెళ్లికి అడ్డుగా మారింది. పెళ్లి మండపానికి వెళ్లడానికి ఒక్కటంటే ఒక్క వాహనం కూడా దొరకకపోవడంతో... ముహుర్త సమయం దగ్గర పడుతుండడంతో ఏం చేయ
కావేరీ జలాల వివాదంపై ఇరు రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేగడం ఓ నవ వధువు పెళ్లికి అడ్డుగా మారింది. పెళ్లి మండపానికి వెళ్లడానికి ఒక్కటంటే ఒక్క వాహనం కూడా దొరకకపోవడంతో... ముహుర్త సమయం దగ్గర పడుతుండడంతో ఏం చేయాలో తెలీక పాపం వధువు కాలినడకనే బయలుదేరింది. ఆమెతో పాటు కుటుంబసభ్యులు మంగళవారం రోజు ఉదయం పాదయాత్ర మొదలుపెట్టారు.
అసలు విషయం ఏంటంటే... కర్ణాటకకు చెందిన ఓ వధువుకు తమిళనాడుకు చెందిన వరుడికి బుధవారం తమిళనాడులోని వనియంబాడిలో పెళ్లి జరగాల్సి ఉంది. ఇరు రాష్టాల్లో గొడవలు జరగడంతో వాహనాలు దొరక్క పెళ్లి దుస్తుల్లో చక్కగా అలంకరించుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వధువు మీడియా ఛానల్ కంట పడటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఎన్నో కలలతో పెళ్లి చేసుకోవలసిన సమయంలో ఎంతో ఇబ్బంది పడుతున్నామని, ఈ రోజు ఎప్పటికీ మర్చిపోలేమని వధువు ఆవేదన పడ్డారు. దాదాపు 600 మందికి శుభలేఖలు పంచామని, వాహనాలు లేకపోవడంతో కేవలం 20 మంది మాత్రమే పెళ్లికి వస్తున్నారన్నారు.
ఇలా ఆందోళనలు చేయడం మంచి పద్ధతి కాదని, రాష్ట్రాలు వేరైనా అందరూ భారతీయులమేనని ఆమె అన్నారు. తమిళనాడులో కర్ణాటక వాహనాలపై, కర్ణాటకలో తమిళ వాహనాలపై దాడులు జరగడంతో ఇరువైపుల నుంచి రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామంటూ వాపోయారు.