కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. ఫోక్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. మైసూర్ ఆలయ ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆయన హుషారుగా స్టెప్పులేశారు.
73 ఏళ్ల సిద్ధరామయ్య తన సొంత ఊరు.. సిద్ధారామనహుండి నుంచి వచ్చిన బృందంతో కలిసి వీర కునిత అనే జానపద నృత్యానికి నృత్యం చేశారు.
ఆ ఆలయ దైవం సిద్ధరామేశ్వరుడ్ని ప్రార్థిస్తూ.. గాల్లో చేతులు ఆడిస్తూ డ్యాన్సులు వేశారాయన. ఆ దైవం పేరు మీదే ఆయనకు సిద్ధరామయ్య పేరు పెట్టారు. పైగా అక్షరాభ్యాసం కంటే ముందు నుంచే ఆయన వీర కునిత నృత్యంలో ఆరితేరారు. అందుకే అంత లయబద్ధంగా వాళ్లతో కలిసి హుషారుగా గంతులేయగలిగారు.
ఈ వీడియోను ఆయన తనయుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే యతింద్ర సిద్ధరామయ్య షేర్ చేశారు. మూడేళ్లకొకసారి ఈ ఆలయ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి.
కానీ, ఆలయ పునర్మిర్మాణం, కరోనా కారణంగా గత ఆరేళ్లుగా ఈ వేడుకలు జరగలేదు. దీంతో ఈ దఫా వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.