తల్లి గర్భం నుంచే సీఎం.. సీఎం అంటూ జగన్ బయటకొచ్చాడు... పాలిటిక్స్‌కు గుడ్‌బై : జేసీ
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు విమర్శల వర్షం కురిపించారు. తల్లి గర్భం నుంచే ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి అంటూ జగన్ బయటకొచ్చారని వ్యంగ్యాస్త్
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు విమర్శల వర్షం కురిపించారు. తల్లి గర్భం నుంచే ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రి అంటూ జగన్ బయటకొచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరొకరు అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పుట్టాక ముఖ్యమంత్రి అంటూ కేకలు వేస్తున్నారని అన్నారు. వీరిద్దరూ ముఖ్యమంత్రులు అయితే రాష్ట్రానికి నిజమైన సీఎం ఎవరయ్యా అంటూ ప్రశ్నించారు.
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అనంతపురంలో టీడీపీ ఎంపీలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, తన మనసులోని మాటను వెల్లడించారు. త్వరలోనే తాను రాజకీయాలకు గుడ్ బై చెపుతానని ప్రకటించారు.
రాష్ట్రానికి చెందిన వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కావడం కూడా రాష్ట్రానికి శాపమైందన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నంత వరకు ఏపీకి బెల్లం ముక్క కూడా ఇవ్వరని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు కూడా చెప్పానని అన్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ప్రయత్నం చేయాలని సీఎం అన్నారని తెలిపారు. పదవులు వస్తున్నకొద్దీ హుందాగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కేంద్రం హామీలు ఇచ్చి మోసం చేయడం న్యాయమా అని జేసీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్, పవన్ కళ్యాణ్‌లపై ఆయన విమర్శలు గుప్పించారు.
మరోవైపు, అనంతపురం రాజకీయాలను కనుసైగతో శాసించారు. రాజకీయాల్లో తలపండిన జేసీ ఇప్పుడు రాజకీయాలకు గుబ్‌బై చెప్పబోతున్నారని, ఆయన వారసుడిగా పవన్‌రెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో జేసీ తన రాజకీయ ప్రస్థానంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాజకీయాలకు గుడ్ బై చెప్తానని వెల్లడించారు.