జయలలిత మృతి.. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డికి సమన్లు.. విచారణకు రావాలని?
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ సీ రెడ్డిని విచారించాలని రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ నిర్ణయించింది. జయమ్మ మృతి మిస్టరీపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ న్యా
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ సీ రెడ్డిని విచారించాలని రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ నిర్ణయించింది. జయమ్మ మృతి మిస్టరీపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్, జయకు తుది రోజుల్లో చికిత్స జరిపిన అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చింది.
ఇందుకోసం, వారం రోజుల సమయం ఇస్తూ, నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే జయలలితకు అందించిన చికిత్స, చేసిన వైద్య పరీక్షల వివరాలను అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతా రెడ్డి తరఫున ఆర్ముగ స్వామి కమిషన్‌కు ఆస్పత్రి అధికారులు నివేదికను పంపగా, మరికొన్ని అంశాల గురించి సమగ్రంగా విచారించేందుకు ప్రతాప్ సీ రెడ్డిని విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు సమన్లు పంపి, ఆపై వారంలోపు విచారించాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు జయలలిత మృతిపట్ల మిస్టరీని సాధ్యమైనంత వరకు తేల్చే దిశగా విచారణను వేగవంతం చేయాలని కమిషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా, జయలలిత కేసులో ఇప్పటికే పలు కోణాల్లో విచారణ సాగిస్తున్న కమిషన్, ఇప్పటికే, జయకు సన్నిహితంగా ఉండే పలువురి నుంచి వాంగ్మూలాలను సేకరించిన సంగతి తెలిసిందే.