Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూలై 6 నుంచి జూలై 19 వరకు పూరీ జగన్నాథుడి రథయాత్ర!!

jagannath rathyaatra

వరుణ్

, సోమవారం, 1 జులై 2024 (16:38 IST)
ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ జగన్నాథుడి విశ్వప్రసిద్ధ రథయాత్ర మహోత్సవాలు జులై 6 నుంచి జులై 19వ తేదీ వరకు జరగనున్నాయి. లక్షలాది మంది ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 315 ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖబ నిర్ణయించింది. ఈ మేరకు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝి, ఉప ముఖ్యమంత్రిలు కనకవర్ధన్‌ సింగ్‌ దేవ్, ప్రభాతి పరిడలకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సమాచారమిచ్చారు. 
 
ఒరిస్సాలోని అన్ని ప్రధాన పట్టణాల మీదుగా రైళ్లు నడిచేలా అధికారులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నారు. బాదం పహాడ్‌, రూర్కెలా, బాలేశ్వర్‌, సోనేపుర్‌, దస్‌పల్లా, జునాగఢ్‌ రోడ్‌, సంబల్‌పుర్‌, కేందుజుహర్‌గఢ్‌, పారాదీప్‌, భద్రక్‌, అనుగుల్, గుణుపుర్‌ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. సంధ్యా దర్శన్‌, బహుదా యాత్రకు వచ్చే భక్తుల కోసం కూడా ప్రత్యేక రైళ్లను నడిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది.
 
దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపే అవకాశం ఉంది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వేడుకలు కొనసాగినన్నాళ్లు భక్తులతో పూరీ రైల్వే స్టేషన్‌ రద్దీగా మారే అవకాశమున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ ఫకువాల్‌ తెలిపారు. 
 
రైల్వేశాఖ తరపున సుమారు 15 వేల మంది భక్తులకు ఆశ్రయం కల్పించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆనవాయితీ ప్రకారం జగన్నాథుడు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి గుండిచా మందిరానికి మూడు వేర్వేరు రథాల్లో చేరుకుంటారు. ఆషాడ శుక్లపక్షమి హరిశయన ఏకాదశి రోజున నిర్వహించే అపురూప ఘట్టం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తుంటారు. ఆ రోజున పెద్ద మొత్తంలో రైళ్లు నడపాలని అధికారులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజలు చిత్తుగా ఓడించినా సరే మూడు రాజధానులకే కట్టుబడివున్నాం : బొత్స సత్తిబాబు