కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని పోలీసులు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ముఖ్యంగా, వెస్ట్ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై స్పందించారు. ఆందోళనలు చేపట్టడం తమకు హక్కు అని అన్నారు. కానీ హింసను ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిరసనల్లో హింసకు దిగుతున్నవారు.. ఆ ఆందోళనలకు శత్రువులవుతారన్నారు. ప్రదర్శనలు చేపట్టాలని కానీ, వాటిని శాంతియుతంగా చేపడితేనే ఫలితం ఉంటుందని ఓవైసీ తెలిపారు.
మరోవైపు, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ హింసపై స్పందించారు. "సమస్యకు హింస పరిష్కార మార్గం కాకూడదని వ్యాఖ్యానించారు. జాతి, సమగ్రత, ఐక్యతను దృష్టిలో ఉంచుకుని.. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న హింస బాధ కలిగిస్తోందని.. ప్రజలంతా శాంతియుతంగా ఐక్యతతో ఉండాలి" అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.