Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశం పేరు ఇండియా నుంచి "భారత్‌"గా మార్పు?

Advertiesment
bharat
, మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (17:24 IST)
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దేశం పేరును భారత్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇండియాగా ఉన్న దేశం పేరును భారత్‌గా మార్చనుంది. 
 
ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీ లో జీ20 సమ్మిట్ జరగబోతున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో జీ20 దేశాధినేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా విందు కోసం రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికలను పంపించింది. అయితే ఈ ఆహ్వాన పత్రికల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా'కు బదులుగా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' అని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది.
 
మరోవైపు ఈ నెల 18 నుంచి 22వ తేదీ మధ్య ఐదు రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల అజెండా ఏమిటనేది ఇంతవరకు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో... ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకే ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. 
 
ఇప్పటికే దేశంలోని విపక్షాలు తమ కూటమికి 'ఇండియా' అనే పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కూటమిపై బీజేపీ నిప్పులు చెరిగింది. దేశం పేరు ఎలా పెట్టుకుంటారంటూ బీజపీ నేతలు మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక పెనుదుమారానికి దారి తీసింది.
 
మరోవైపు, దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ... దేశానికి సంబంధించిన పేరుపై అధికార పార్టీ ఎందుకు కలవరపడుతోందో తనకు అర్థం కావడం లేదన్నారు. అయితే ఇండియాను భారత్ మారుస్తారా? అనే విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. 
 
'ఇండియా' కూటమిలోని పార్టీల అధినేతలతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే బుధవారం నిర్వహిస్తున్న సమావేశంలో దీనిపై చర్చిస్తామని శరద్ పవార్ చెప్పారు. శరద్ పవార్ అంతకుముందు మరాఠా రిజర్వేషన్ల అంశంపై కూడా మాట్లాడారు. రిజర్వేషన్లలో తమకు ప్రత్యేక కోటా కేటాయించాలని మరాఠాలు ఆందోళన చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో పవార్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఉన్న 50 శాతం కోటా పరిమితిని ఎత్తివేయాలన్నారు. ఇతర వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లను సమకూర్చాలంటే ఇప్పుడున్న దానికి అదనంగా 15 నుండి 16 శాతం పెంచాలన్నారు. మరాఠా కోటాపై జరుగుతోన్న ఆందోళనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో పవార్ ఈవ్యాఖ్యలు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పండగ సీజన్‌లో సామాన్యులకు శుభవార్త ...