Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమర్జెన్సీని విమర్శిస్తారా.. ఇపుడు అద్వానీ పరిస్థితి ఏంటి? సంజయ్ రౌత్ ప్రశ్న

బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిపోరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన

Advertiesment
ఎమర్జెన్సీని విమర్శిస్తారా.. ఇపుడు అద్వానీ పరిస్థితి ఏంటి? సంజయ్ రౌత్ ప్రశ్న
, సోమవారం, 2 జులై 2018 (16:20 IST)
బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిపోరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని బీజేపీ తప్పుబట్టింది. ఇంకా ఇందిరమ్మను నియంత హిట్లర్‌తో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఏకంగా పోల్చారు. బీజేపీ అగ్రనేతలు ఎమెర్జెన్సీ విధించిన రోజును బ్లాక్‌ డేగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 
 
అయితే ఎమర్జెన్సీని బీజేపీ తప్పుబట్టడంపై శివసేన మండిపడింది. ఇందిరమ్మ ఎమర్జెన్సీని విధించిన రోజును బ్లాక్ డేగా నిర్వహించాలని అనుకుంటే... ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో బ్లాక్ డేలను నిర్వహించాల్సి ఉంటుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన రోజును కూడా బ్లాక్ డేగా జరుపుకోవాలని రౌత్ అభిప్రాయపడ్డారు.
 
నోట్ల రద్దు విషయంలో ప్రజలు నానా తంటాలు పడ్డారని.. కొందరు కొన్ని రోజుల పాటు ఉపాధిని కోల్పోయారని, చిన్నచిన్న వ్యాపారులు ఎంతో నష్టపోయారని గుర్తుచేశారు. కానీ నోట్ల రద్దు వ్యవహారం నల్ల కుబేరుల డబ్బు వైట్‌గా మారేందుకు ఉపయోగపడిందని రౌత్ దుయ్యబట్టారు. నోట్ల రద్దుతో నల్లధనం బయటకు వస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. కానీ, డబ్బు కోసం క్యూలలో నిలబడి ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారని మండిపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్న ఓ బ్యాంకు నోట్ల రద్దు సమయంలో కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా రూ.575 కోట్లను మార్పిడి చేసిందని గుర్తుచేశారు. 
 
1975లో తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఇందిరని విమర్శించడం తగదన్నారు. దేశానికి ఆమె చేసిన సేవలను ఎలా విస్మరిస్తామని ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. వాస్తవానికి ప్రజాస్వామ్యానికి ఇందిర ఎంతో గౌరవం ఇచ్చారని... ఎమర్జెన్సీని ఎత్తేసిన తర్వాత 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారని గుర్తుచేశారు. దేశానికి ఎంతో చేసిన మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, వీర్ సావర్కర్ లాంటి మహనీయులను తక్కువ చేసి చూపించాలనుకోవడం సరైంది కాదని చెప్పుకొచ్చారు. 
 
దేశానికి ఇందిర చేసినంత గొప్పగా మరెవరూ చేయలేకపోయారని సంజయ్ రౌత్ పునరుద్ఘాటించారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటాయని... ఆ నిర్ణయాలు కరెక్టా? తప్పా? అనేది ఎవరైనా ఎలా నిర్ణయిస్తారని అడిగారు. తప్పని పరిస్థితుల్లోనే ఇందిర ఎమర్జెన్సీని విధించి ఉండవచ్చని చెప్పారు. కేవలం ఎమర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని, ఆమెపై చెడుగా ముద్ర వేయాలనుకోవడం తగదన్నారు. 
 
ఎమర్జెన్సీ సమయంలో అద్వానీని జైల్లో పెట్టారని... ప్రస్తుతం అద్వానీని కనీసం మాట్లాడలేని స్థితిలోకి నెట్టేశారని దెప్పిపొడిచారు. బీజేపీలోని ఎంతో మంది సీనియర్ నేతలు మౌనంగా ఉండిపోయేలా చేశారని మండిపడ్డారు. ఎమర్జెన్సీకన్నా ఇది అత్యంత దారుణమైన పరిస్థితి అని రౌత్ దుయ్యబట్టారు. 
తాను ఎమర్జెన్సీని మద్దతు చేయడం లేదని ఇదే సమయంలో వ్యతిరేకించడం లేదన్నారు. 
 
ఎమర్జెన్సీ సమయంలో పేరుమోసిన డాన్లు కటకటాలు లెక్కపెట్టారని... ఇప్పుడు కోట్లు కొల్లగొట్టిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వాళ్లు దర్జాగా విదేశాలకు చెక్కేస్తున్నారని దుయ్యబట్టారు. అస్తవ్యస్తంగా ఉన్న దేశాన్ని గట్టెక్కించేందుకే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారని రౌత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని చూసి ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు భయపడుతున్నారని... అందుకే ఇందిరా గాంధీని పదేపదే టార్గెట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోక్షం కోసం సామూహిక సూసైడ్స్.. ఆ లేఖలో ఏముందంటే...