2047 వికసిత్ థీమ్‌తో ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలు జరగుతున్నాయి. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వ సారి త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అలాగే జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత సైన్యం హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ వేడుకలు పునరుత్తేజాన్ని అందించనున్నాయి.
ఈ సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు.
ఈ ఏడాది ఎర్రకోటలో జరిగే వేడుకలను చూసేందుకు యువకులు, గిరిజనులు, రైతులు, మహిళా వర్గాలతో పాటు ఇతర ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన, వివిధ రంగాలలో రాణించిన వారిని వేడుకలకు ఆహ్వానించారు.
"దేశం కోసం ధైర్యంగా, కష్టపడి పనిచేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న మన సైనికులు, మన రైతులు, మన యువత అందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో కొన్ని విపత్తుల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుఃఖం, కష్ట కాలంలో దేశం అడుగడుగునా వారికి అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు నేను భరోసా ఇస్తున్నాను" అని మోదీ తెలిపారు.