Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళ ప్రభుత్వంపై ముప్పేట దాడి : ఐటీ.. సీబీఐ.. ఈడీ... ఉక్కిరిబిక్కిరవుతున్న నేతలు

తమిళనాడు ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతోంది. ఒకవైపు.. ఐటీ, మరోవైపు.. సీబీఐ, ఇంకోవైపు ఈడీ అధికారుల దాడులతో రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన మంత్రులు, నేతలు, ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు

Advertiesment
తమిళ ప్రభుత్వంపై ముప్పేట దాడి : ఐటీ.. సీబీఐ.. ఈడీ... ఉక్కిరిబిక్కిరవుతున్న నేతలు
, గురువారం, 22 డిశెంబరు 2016 (15:06 IST)
తమిళనాడు ప్రభుత్వంపై ముప్పేట దాడి జరుగుతోంది. ఒకవైపు.. ఐటీ, మరోవైపు.. సీబీఐ, ఇంకోవైపు ఈడీ అధికారుల దాడులతో రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన మంత్రులు, నేతలు, ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్నంత వరకు రాష్ట్రంవైపు కన్నెత్తి చూసేందుకు సైతం అధికారులు సాహసం చేసేవారు లేకపోయేవారు కానీ, జయలలిత కన్నుమూసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 
 
జయలలిత చనిపోయి 15 రోజులైనా గడవకముందే తమిళనాడులో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకేలోని ఇరు వర్గాలను ఇరకాటంలో పెట్టేలా, ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం సర్కారును సంక్షోభంలోకి నెట్టేలా పరిణామాలు సంభవిస్తున్నాయి. నిజానికి జయలలిత జీవించివుంటే కేంద్ర సర్కారు తమిళనాడు వైపు కన్నెత్తి చూడగలిగేదా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. 
 
నిజానికి జయలలిత అనారోగ్యం బారిన పడినప్పటి నుంచే తమిళనాడులో ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు అన్బునాథన్, నత్తం విశ్వనాథన్, మంత్రి పళనిస్వామి, చెన్నై నగర మేయర్‌ సైదై దురైస్వామిని టార్గెట్‌ చేశారు. ఐటీకితోడు సీబీఐ, ఈడీ కూడా రంగంలోకి దిగాయి. దీంతో ఏ క్షణంలో ఎవరిపై దాడి జరుగుతుందోనని అన్నాడీఎంకే నేతలు బిక్కుబిక్కుమంటున్నారు. 
 
అన్నాడీఎంకే ప్రస్తుతం పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాలుగా చీలిపోయిందనే ప్రచారం సాగుతోంది. కేంద్ర విభాగాలు రెండు వర్గాలకు చెందిన నేతల ఇళ్లలోనూ సోదాలు జరుపుతున్నాయి. సీఎం సెల్వం ప్రధానిమోడీ, వెంకయ్య నాయుడుతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన సీఎం అయ్యేందుకు కేంద్రం సహకరించిందన్నది బహిరంగ రహస్యమే. 
 
అలాంటప్పుడు ఆయనకు సన్నిహితులైన శేఖర్‌రెడ్డి, రామ్మోహన్ రావు ఇళ్లలో ఐటీ అధికారులు ఎలా దాడి చేస్తారన్నది చర్చనీయాంశమైంది. పోనీ శశికళకు సహకారమందిస్తోందా? అంటే ఆమె వర్గానికి చెందిన పళనిస్వామికీ పోటు తప్పలేదు. దీంతో మోడీ సర్కారు అసలు ఉద్దేశం ఏమిటన్నది అన్నాడీఎంకే నేతల్ని తొలుస్తోంది. ముఖ్యమంత్రి సెల్వం గానీ, పార్టీ పగ్గాలు చేపట్టనున్న శశికళగానీ తాజా పరిణామాలపై నోరు మెదపడం లేదు. ఎవరికి వారు సర్దుకునే పనిలో బిజీగా గడుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళకు నో క్రేజ్ ఎంజీఆర్ సమాధి నుంచి ''అమ్మా డీఎంకే పార్టీ'' ఆవిర్భావం..