అయోధ్య కేసు వాదనలు వాడీవేడిగా సాగుతున్న సమయంలో భోజన విరామాన్ని తీసుకుంది సుప్రీం ధర్మాసనం. హైడ్రామా అయోధ్య కేసు వాదనల సమయంలో సుప్రీంకోర్టులో హైడ్రామా జరిగింది.
ముస్లీంల తరఫున వాదనలు వినిపిస్తున్న రాజీవ్ ధావన్... హిందువుల తరఫు న్యాయవాది ఇచ్చిన పేపర్లను చింపివేశారు. అయోధ్యలో వివాదాస్పద 2.77ఎకరాల భూమి సన్నీ వక్ఫ్ బోర్డుకే చెందుతుందని ఆధారాలను రాజీవ్ ధావన్ కోర్టుకు చూపే సమయంలో... హిందుమహాసభ తరఫున వాదనలు వినిపిస్తున్న సీఎస్ వైద్యనాథన్ లేచి ఆ భూమి హిందువులకు చెందుతుందని కొన్ని మ్యాప్లు, పుస్తకాన్ని రాజీవ్కు ఇచ్చారు.
అవి మాజీ ఐఏఎస్ అధికారి కే.కిషోర్ ప్రచురణలని ఆగ్రహంతో వాటిని చింపివేశారు రాజీవ్. 1986లో ముద్రించిన పుస్తకాన్ని రికార్డుల్లోకి తీసుకోవద్దని అభ్యంతరం తెలిపారు. అంతకుముందు హిందుమహాసభ న్యాయవాది వాదనలు వినిపిస్తున్న సమయంలో మధ్యలో జోక్యం చేసుకున్నారు రాజీవ్.
వాదనల సమయంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆగ్రహానికి గురయ్యారు. వాదనలు ఈ రకంగా కొనసాగితే ఇక్కడి నుంచి లేచి వెళ్లిపోవడమే మేలని వ్యాఖ్యానించారు.