గురుగ్రహం చందమామ గానీమీడ్ వాతావరణంలో నీటి ఆవిరి ఉనికిని శాస్త్రవేత్తలు తొలిసారిగా గుర్తించారు. అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన హబుల్ టెలిస్కోపు అందించిన తాజా, పాత డేటాను విశ్లేషించి ఈ మేరకు తేల్చారు. ఆ ఉపగ్రహ ఉపరితలం మీదున్న ఐస్.. ఘన రూపం నుంచి నేరుగా వాయు రూపంలోకి మారినప్పుడు నీటి ఆవిరి ఏర్పడుతున్నట్లు గుర్తించారు. సౌర కుటుంబంలోని చందమామలన్నింటిలోకి గానీమీడ్ అతిపెద్దదిగా గుర్తించారు. భూమి మీదున్న మహాసాగరాల్లో ఉన్న మొత్తం నీటి కన్నా ఈ చందమామలోనే ఎక్కువ నీరు ఉండొచ్చని మునుపటి పరిశోధనలు కొన్ని ఆధారాలను వెల్లడించిన విషయం తెల్సిందే. అయితే తీవ్ర శీతల పరిస్థితుల వల్ల అక్కడి ఉపరితలం మీద నీరు ఘనీభవించి ఉందని నాసా పేర్కొంది.