Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వంసిద్ధం - పోటీలో ఉన్నది ఎవరో తెలుసా?

Advertiesment
cpr - sudarshan

ఠాగూర్

, మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (08:48 IST)
దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలు మంగళవారం జరుగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికలో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య పోరు నెలకొంది. ఎన్డీఏ తరపున సీనియర్ నేత, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగుతేజం జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఎన్నికను రెండు ప్రధాన కూటముల మధ్య బలపరీక్షగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
 
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ భవన్‌లో జరుగుతుంది. ఉభయ సభలకు చెందిన ఎంపీలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ ముగిసిన వెంటనే, సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రికి ఫలితాలు వెల్లడించి, దేశ నూతన ఉపరాష్ట్రపతి వెల్లడిస్తారు. 
 
ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో లోక్‌సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 781 మంది ఎంపీలు ఉన్నారు (ప్రస్తుతం 7 స్థానాలు ఖాళీగా ఉన్నాయి). గెలుపునకు 391 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ అవసరం. అధికార ఎన్డీఏ కూటమికి సొంతంగా 425 మంది ఎంపీల బలం ఉంది. దీనికి తోడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎంపీలు కూడా మద్దతు ప్రకటించడంతో వారి సంఖ్య 436కు చేరింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలో ఓటింగుకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ, ఒడిశాకు చెందిన బిజూ జనతా దళ్ (బీజేడీ) నిర్ణయించాయి. 
 
మరోవైపు, ప్రతిపక్ష ఇండియా కూటమికి 324 మంది ఎంపీల మద్దతు ఉంది. సంఖ్యాబలం పరంగా ఎన్డీఏ అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నప్పటికీ, గత ఎన్నికలతో పోలిస్తే ఆధిక్యం తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2022లో జగదీప్ ధనఖడ్ 346 ఓట్ల భారీ మెజారిటీతో గెలవగా, ఈసారి ఆధిక్యం 100 నుంచి 125 ఓట్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు.
 
ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (67) తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత. వాజ్ పేయి హయాంలో కోయంబత్తూరు నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్నారు. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరున్న ఆయన రాజ్యసభ చైర్మన్ పదవికి సరైన వ్యక్తి అని బీజేపీ ప్రచారం చేస్తోంది.
 
ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (79) తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ మద్దతున్న సల్వాజుడుంను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడం, నల్లధనంపై దర్యాప్తునకు ఆదేశించడం వంటి సంచలన తీర్పులతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 
 
సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయానికి ప్రతీకగా ప్రతిపక్షాలు ఆయన్ను నిలబెట్టాయి. ఆదివారం ఎంపీలను ఉద్దేశించి విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో, జస్టిస్ సుదర్శన్ రెడ్డి పార్టీలకు అతీతంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ఒక ఎన్నిక కాదని, భారత స్ఫూర్తిని నిలబెట్టే ఓటు అని ఆయన పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ లోనివీఎస్డీ టెక్ పార్క్‌లో ఇటాలియన్ రెస్టారెంట్ టోస్కానో బ్రాంచ్