కాశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా, పాక్ జాతీయుల వీసాలను రద్దు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. అలాగే, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి తక్షణం వెనక్కి పంపాలని కేంద్ర హోం శాఖ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అపుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు.
గతంలో భారత్ సార్క్ వీసా పొడగింపు పథకం కింద అనేక మంది పాక్ పౌరులకు భారత్‌లో పర్యటించే అవకాశాలను కల్పించింది. ఈ పథకం కింద భారత్‍లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. వైద్య వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
ఇక పాక్ నుంచి కొత్త దరఖాస్తులుకు వీసా సర్వీసులను తక్షణమే నిలిపివేశామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీంతో పాటు పాక్‌లో ఉన్న భారత జాతీయులు తిరిగి వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేసింది. అదేసమయంలో ఇక్కడ ఉన్న పాక్ జాతీయులు గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్ళిపోవాలని హెచ్చరించింది.