పంజాబ్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం దుమ్ము దుమారాన్నే రేపుతోంది. సీఎంగా కెప్టెన్ అమరీందర్‌ను కొనసాగిస్తూనే, పీసీసీ అధ్యక్ష బాధ్యతలు సిద్దూకు అప్పజెప్పాలని అధిష్ఠానం నిర్ణయించింది.
ఈ నిర్ణయంపైనే ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నిప్పులు గక్కుతూ అధినేత్రి సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. పంజాబ్ విషయంలో అధిష్ఠానం మితిమీరిన జోక్యం చేసుకుంటోందని తీవ్రంగా దుయ్యబట్టారు.
పంజాబ్‌లో పరిస్థితి అంత అనుకూలంగా ఏమీ లేదని లేఖలో పేర్కొన్నారు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం అధిష్ఠానం వ్యవహార శైలితో భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు.
పార్టీలోని సీనియర్లను తక్కువగా అంచనా వేయవద్దని, అలా తక్కువగా అంచనా వేస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుందని సీఎం అమరీందర్ సింగ్ లేఖలో పేర్కొన్నారు.