Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంగుళూరు మునిగిపోయింది.. తెలంగాణాలో వర్షాలే వర్షాలు

ఈ యేడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందుగానే ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఈ రుతపవనాలు ప్రవేశించీప్రవేశించకముందే దక్షిణ భారతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

Advertiesment
Heavy rains
, బుధవారం, 30 మే 2018 (15:49 IST)
ఈ యేడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందుగానే ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఈ రుతపవనాలు ప్రవేశించీప్రవేశించకముందే దక్షిణ భారతంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా, గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షంతో కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు మునిగిపోయింది. అలాగే, తెలంగాణాలో కూడా జూన్ 3వ తేదీ నుంచి వర్షాలు దంచికొడుతాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
 
ముఖ్యంగా, మంగుళూరు వాసులు మాత్రం సరికొత్త అనుభవాన్ని చూశారు. వర్షం ఇలా కూడా పడుతుందా.. ఇంత భారీగా పడుతుందా.. ఆకాశానికి పెద్ద చిల్లు పడితే.. కుండను కుమ్మరిస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాంటి అనుభవాన్ని ఈ ప్రాంత వాసులు చూశారు. గత 24 గంటలుగా పడుతున్న వర్షంతో.. వీధులు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై వాహనాలు మునిగిపోయాయి. ఇళ్లలోనే నడుంలోతు నీళ్లు వచ్చాయి. పార్కింగ్ స్థలాల్లో వాహనాలు కనిపించటం లేదు. 
 
మంగుళూరు లాల్‌బాగ్ ఏరియాలోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ సెల్లార్ పార్కింగ్ నీళ్లతో నిండి.. వాహనాలు కనిపించటం లేదు. మంగుళూరు, ఉడిపి ప్రాంతాల్లో ఇప్పటివరకు 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ 2వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
గాలులు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. మంగుళూరు - బెంగళూరు హైవే ధ్వంసం అయ్యింది. రహదారి మొత్తం నీట మునిగింది. ట్రాఫిక్ స్తంభించింది. ఇక ఉడిపి - కేరళను కలిపే ఫ్లైఓవర్ కూడా నీట మునిగింది. చాలా ఇళ్లల్లోకి నీళ్లు చేరుకున్నాయి. దీంతో స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవు ప్రకటించారు. 
 
మరోవైపు, దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు.. మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కేరళలోని మిగిలిన ప్రాంతాలతో పాటు కోస్టల్ కర్ణాటక, దక్షిణ కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అయితే జూన్ 3 నుంచి తెలంగాణలో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముందస్తు అంచనా ప్రకారం అయితే.. జూన్ 9వ తేదీకి తెలంగాణలోకి నైరుతి ప్రవేశించొచ్చని భావించారు. అయితే రుతుపవనాల రాకకు వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. 
 
జూన్ 3వ తేదీ నుంచే తెలంగాణలో రుతుపవనాల ప్రభావం మొదలవుతుందని.. వర్షాలు పడతాయని ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ఏడాది సాధారణ వర్షాపాతం నమోదు అవుతుందని ఐఎండీ ప్రకటించింది. జూన్ - సెప్టెంబర్ మధ్య సాధారణ వర్షపాతం 97 శాతంగా అధికారులు అంచనా వేశారు. దక్షిణ భారతంలో 95 శాతం, ఈశాన్య భారతంలో 93 శాతం వర్షాపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే, సెంట్రల్ భారతంలో 99 శాతం, వాయువ్యభారతంలో 100 శాతం వర్షాలు పడతాయని అభిప్రాయపడుతున్నారు. జూలైలో సగటున 101 శాతం, ఆగస్టులో 94 శాతం వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్టు చెప్పారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చలించి... కన్నీరుకార్చిన 'బాషా'.. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు సాయం..