పాము కాటు వేస్తే సాధారణంగా భయంతో చాలామంది స్పృహ తప్పి కిందపడిపోతారు. అయితే యూపీకి చెందిన ఓ వ్యక్తి మాత్రం తనను కాటు వేసిన పామును నోటితో కొరికి ముక్కలు ముక్కలు చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు అతనికి సరైన చికిత్స అందించి కాపాడారు.
హర్దోయ్ జిల్లా తడియావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భడాయల్ గ్రామం మజ్రా పుష్పతాలికు చెందిన 28 ఏళ్ల పునీత్ నవంబర్ 4న తన పొలంలో పనిచేస్తున్నాడు. అదే సమయంలో మూడు నుంచి నాలుగు అడుగుల పొడవున్న నల్లటి నాగుపాము అతడి కాలుకు చుట్టుకుని కాటేసింది.
దాన్ని గమనించి ముందు షాకైన పునీత్ వెంటనే ఆ కోబ్రా పామును పట్టుకుని.. కోపంతో దాని తలను కొరికేశాడు. ఆ యువకుడు చేసిన పనికి పాము తల, మొండెం వేరు వేరుగా పడిపోయింది. ఈ విషయాన్ని స్థానికులు తెలుసుకుని వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించారు.
అక్కడ అక్కడ ఒక రాత్రి ట్రీట్మెంట్ అందించిన తర్వాత మరుసటి రోజు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. యువకుడి కాలికి పాముకాటు గుర్తులుండటంతో సరిపోయిందని వైద్యులు అన్నారు. పేషెంట్ చేసిన పని మాత్రం చాలా ప్రమాదకరమని.. నల్లటి కోబ్రా పడగను నోటితో అతను కొరికాడు.
అది అతడి నోటిలో కాటు వేసినా లేదా దాని విషం నోటిలోకి వెళ్లినా.. అతడి ప్రాణాలను రక్షించడం కష్టంగా మారేది అని వైద్యులు చెప్పుకొచ్చారు.