Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో ప్రభుత్వ విమాన సర్వీసులు శాశ్వతంగా బంద్???

దేశంలో ప్రభుత్వ విమాన సర్వీసులు శాశ్వతంగా బంద్???
, సోమవారం, 31 ఆగస్టు 2020 (10:11 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అనేక రంగాలు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకునిపోయాయి. అలాంటి వాటిలో పౌర విమానయాన రంగం ఒకటి. కరోనా వైరస్ కారణంగా గత మార్చి నెలాఖరు నుంచి విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. దీంతో విమాన రంగం ఆర్థికంగా బాగా చితికిపోయింది. అసలే అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఈ విమాన రంగం.. కరోనా వైరస్ దెబ్బకు కోలుకోలేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో మున్ముందు ప్రభుత్వం విమాన సర్వీసులు నడిపే పరిస్థితి లేదంటూ ఆ శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని విమానాశ్రయాలను, విమానయాన సంస్థలను కేంద్ర ప్రభుత్వం స్వయంగా నడిపించే పరిస్థితి లేదని ఆయన బాంబు పేల్చారు. 
 
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఈ సంవత్సరంలోనే పూర్తవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటీవల సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, కేరళలోని తిరువనంతపురం ఎయిర్ పోర్టును అదానీ ఎంటర్ ప్రైజస్‌కు అప్పగించడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో హర్దీప్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదేసమయంలో దేశంలోని విమానాశ్రయాల నిర్వహణలో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్) విధానానికి పెద్దపీట వేస్తామని ఆయన వెల్లడించారు.
 
తాజాగా నమో యాప్ ద్వారా జరిగిన ఓ వర్చ్యువల్ మీట్‌లో మాట్లాడిన ఆయన, "నేను నా మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ప్రభుత్వం విమానాశ్రయాలను నడిపించే పరిస్థితి లేదు. విమానయాన సంస్థలను కూడా నడిపించలేదు" అన్నారు. కాగా, ప్రస్తుతం పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలోని ఏఏఐ (ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా) అధీనంలో దాదాపు 100కు పైగా విమానాశ్రయాలు ఉన్నాయి. వీటన్నింటినీ దశలవారీగా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్నది కేంద్ర అభిమతమని చెప్పుకొచ్చారు.
 
ఇదిలావుంటే, ఈ యేడాది ఆఖరు నాటికి దేశవాళీ విమాన ప్రయాణికుల సంఖ్య, కరోనా ముందున్న స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నామని హర్దీప్ సింగ్ అంచనా వేశారు. ప్రస్తుతం విమానాల కెపాసిటీలో 45 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే అధికారులు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇండియాలోని ప్రధాన విమానాశ్రయాలైన లక్నో, అహ్మదాబాద్, జైపూర్, మంగుళూరు, గౌహతి, తిరువనంతపురం విమానాశ్రయాలను అదానీ ఎంటర్ ప్రైజస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ పాలనలో కరోనా వైరస్ విలయతాండవం??