లాక్ డౌన్ కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. బతుకుదెరువు కోసం వెళ్లిన బాలిక ఇంటికి కొద్ది దూరంలో చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన జమ్లో మక్దం(12) అనే బాలిక రెండు నెలల క్రితం తెలంగాణకు బతుకుదెరువు కోసం వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో మిరప తోటలో పనికి చేరింది ఆ బాలిక.
లాక్‌డౌన్ కారణంగా పనులు ఆగిపోయాయి. పూట గడవడం లేదు. దీంచో ఊరెళ్లాలని సదరు బాలికతో పాటు మరో 11 మంది నిర్ణయించుకున్నారు. దీంతో ఏప్రిల్ 15వ తేదీన తాము పని చేస్తున్న మిరప తోట ప్రాంతం నుంచి బీజాపూర్‌కు కాలినడకన బయల్దేరారు.
రహదారి వెంట వెళ్తే పోలీసులు అడ్డుకుంటారని భావించి.. వారు అడవి మార్గాన్ని ఎంచుకున్నారు. మొత్తానికి ఆ బాలిక గ్రామానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. శనివారం మధ్యాహ్నం తీవ్రమైన కడుపు నొప్పితో బాలిక బాధపడింది. అక్కడే కుప్పకూలిపోయింది.
సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని బాలికను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ బాలికకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. పోషకాహారం వల్లే బాలిక మృతి చెందిందని వైద్యులు తెలిపారు.