సాధారణంగా దొంగలు ఇళ్లలో చొరబడి తమ కంటికి కనిపించిన విలువైన వస్తువులను చోరీ చేస్తుంటారు. తాజాగా ఓ దొంగ ఓ మహిళ ఇంట్లో బంగారంతో పాటు నగదును చోరీ చేశాడు. తిన్నగా ఇంటికి వెళ్లిన తర్వాత డబ్బు మాత్రం తను ఉంచుకుని ఆ బంగారాన్ని చోరీ చేసిన ఇంటి యజమానురాలికి పార్శిల్‌లో పంపించాడు. ఈ ఆసక్తికర సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజానగర్ ఎక్స్‌టెన్షన్ పరిధిలోని ఫార్చూన్ రెసిడెన్సీ హౌసింగ్ సొసైటీలో ప్రీతి సిరోహి అనే ఉపాధ్యాయురాలు నివాసం ఉంటున్నారు. ఈమె దీపావళి పండుగ కోసం అక్టోబరు 23వ తేదీన తన స్వగ్రామమైన బులంద్‌షహర్‌కు వెళ్లారు. ఆ తర్వాత అక్టోబరు 27వ తేదీన తిరిగి తిరిగి ఇంటికి వచ్చారు.
ఇంటికి రాగానే ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీలో రూ.25 వేల నగదుతో పాటు బంగారాన్ని ఎత్తుకెళ్లారని పేర్కొన్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు. అయితే, ఈ కేసు దర్యాప్తులో ఉండగానే నాలుగు రోజుల తర్వాత ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ప్రీతికి ఒక పార్శిల్ వచ్చింది. అందులో ఏముందోనని భయపడిన ప్రీతి దానిని పోలీసులకు అప్పగించింది.
పోలీసులు అత్యంత జాగ్రత్తతో ఆ పార్శిల్ విప్పి చూస్తే అందులో చోరీకి గురైన బంగారం ఆభరణాల్లో కొన్ని ఉన్నాయి. దీంతో పోలీసులతో పాటు ప్రీతి ఆశ్చర్యపోయారు. డీటీడీసీ కొరియర్ ద్వారా ఈ పార్శిల్ వచ్చింది. దొంగ తిప్పి పంపిన బంగారు ఆభరణాల విలువ రూ.4 లక్షల మేరకు ఉంటాయని పోలీసులు తెలిపారు.