వెస్ట్ బెంగాల్ రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల్లోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా భారత క్రికెటర్ మనోజ్ తివారీ అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరారు. హుగ్లీలో జరిగిన ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
కేంద్రంలో భాజపా పాలనపై గత కొంతకాలంగా మనోజ్ తివారీ సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఎంసీలో చేరిన సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. భాజపా విభజన విధానం అనుసరిస్తుంటే.. మమతా బెనర్జీ ప్రజల్ని ఐక్యం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
2008 ఫిబ్రవరి 3న జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మనోజ్ తివారీ.. 12 వన్డేలు, మూడు టీ20ల్లో ఆడారు. ఐపీఎల్‌లోనూ పలు జట్ల తరపున ఆడారు. బెంగాల్ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? లేకా టీఎంసీ తరపున ప్రచారం చేస్తారా అన్నది తేలాల్సివుంది.
మరోవైపు "ఈ రోజు నుంచి తన కొత్త ప్రయాణం ప్రారంభమైంద"ని పేర్కొంటూ మనోజ్ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. అభిమానులందరి ప్రేమ, మద్దతును కోరారు.