Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా.. చతికిలపడిన విపక్ష పార్టీలు.. ఎందుకో తెలుసా?

అధికార పక్షంపై ప్రజాగ్రహమే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సారాంశం. 2019 సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత సెమీ ఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడైనాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా.. చతికిలపడిన విపక్ష పార్టీలు.. ఎందుకో తెలుసా?
, సోమవారం, 13 మార్చి 2017 (16:21 IST)
అధికార పక్షంపై ప్రజాగ్రహమే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సారాంశం. 2019 సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత సెమీ ఫైనల్‌గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడైనాయి. పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భాజపా, పంజాబ్‌లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో నెగ్గగా గోవా, మణిపూర్‌లో కాంగ్రెస్ మిగిలిన పార్టీల కంటే ముందంజలో నిలిచింది. స్థూలంగా ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అర్థం అవుతున్నది ఒక్కటే. అది... మణిపూర్ మినహా అన్నింటా అధికారపక్షంపై ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేశారని స్పష్టంగా అవుతుంది. కానీ దురదృష్టవశాత్తూ ప్రధాన మీడియా మాత్రం యూపీ ఎన్నికలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చి ప్రజల మనోభావాలకు భిన్నమైన విశ్లేషణ చేస్తున్నాయి.
 
2014 సాధారణ ఎన్నికలలో దేశవ్యాప్తంగా మంచి మెజారిటీతో మోదీ నాయకత్వంలో భాజపా విజయం సాధించింది. సహజంగా మోదీ పేరు దేశంలో మారు మోగింది. తర్వాత జరిగిన ఢిల్లీ, బీహర్ అసెంభ్లీ ఎన్నికల్లో అదే మోదీని అక్కడి ప్రజలు తిరస్కరించారు. 2016న మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత జరిగిన ఎన్నికలు కావడం దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం యూపీ ఉండటంతో సహజంగానే ఈ ఎన్నికలకు ప్రాధాన్యత వచ్చింది. దేశ ప్రజలు ఐదు రాష్ట్రాల ఫలితాలు పెద్ద నోట్ల రద్దుపై ప్రజా తీర్పుగా ఉంటుందని భావించారు. 
 
కానీ ఐదు రాష్ట్రాల ప్రజలు మాత్రం వారి స్థానిక ప్రభుత్వాల పరిపాలనపై తమ తీర్పును వెల్లడించారు. అంటే జాతీయ స్థాయి రాజకీయాలను (పెద్ద నోట్ల రద్దుతో సహా) పెద్దగా జనం పట్టించుకోలేదు. జాతీయ రాజకీయాలను జనం పట్టించుకొని ఉంటే యూపీలో భాజపాకు భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలు అదే పార్టీని పంజాబ్, గోవాలో ఎందుకు తిరస్కరించారు. 
 
లేదు కాంగ్రస్‌కు అనుకూలం అనుకుంటే వారిని ఉత్తరాఖండ్, యూపీలో ఎందుకు ఆదరించలేదు. కనుక అన్ని రాష్ట్రాల ప్రజలు తమ స్థానిక ప్రభుత్వాలను తిరస్కరించారు. అదే సందర్భంలో అక్కడి ప్రధాన ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారు. యూపీలో అధికార సమాజ్‌వాదీ పార్టీ దుష్ట పాలనను ప్రజలు తిరస్కరించారు. మాయావతిపై వ్యతిరేకత లేకపోయినా అధికార పార్టీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత కారణంగా ఒక్క భాజపాకే ప్రజలు పట్టం కట్టారు. అలా అఖిలేష్ యాదవ్ పాలనపై తమ నిరసనను తెలిపారు.
 
అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌పై ప్రజలు తిరగబడ్డారు. పంజాబ్‌లో అక్కడి భాజపా, దాని మిత్రపక్షం అకాలీ పాలనపై తమ ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. అది ఎంతగానంటే అధికార పార్టీకి ప్రతిపక్ష హోదాను సైతం ఇవ్వనంతగా. ఇక్కడ కొందరు భాజపా నేతలు పంజాబ్ ఎన్నికల ఫలితాలు తమకు వ్యతిరేకం కాదని వాదిస్తున్నారు. 
 
కానీ అకాలీదళ్‌ను ప్రజలు ఎలా ఓడించారో అదే రీతిన భాజపాను ఓడించినట్లు తుది ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. యూపీ, ఉత్తరాఖండ్‌లో విజయం సాధించిన భాజపా తానే అధికారంలో ఉన్న గోవాలో మాత్రం ప్రజల తిరస్కారానికి గురైంది. అక్కడ ఆప్ చెప్పుకో దగ్గ ఓట్లును చీల్చినా అధికార పార్టీ గెలవకపోవడం అక్కడి పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న విషయం అర్థమైంది. ఇక మణిపూర్ ఫలితాలు కొంత భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రస్ దాదాపు సాధారణ మెజారిటికి చేరువలోకి వచ్చింది. గోవా, మణిపూర్‌లో ఎవరు అధికారంలోకి వచ్చినా రెండు రాష్ట్రాలలో భాజపాను ప్రజలు ఆదరించలేదన్నది ప్రజా తీర్పుగా చూడాలి.
 
మొత్తంగా ఈ ఫలితాలలో కనపడేది రెండు విషయాలు. 
 
1. అన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలను ప్రజలు తిరష్కరించారు. ఇందుకు భాజపా, కాంగ్రెస్, ఎస్పీ ఎవరూ మినహయింపు కాదు. అంటే జాతీయ రాజకీయాలకు ఇక్కడ ప్రాధాన్యత లేదు. 
 
2. సాధారణంగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు అనుకూలం అయితే కమలానికి ప్రతికూలం లేదా కమలానికి అనుకూలం అయితే అది కాంగీకి ప్రతికూలంగా ఉండేవి. కానీ ఈ ఎన్నికలు మాత్రం రెండు పార్టీలకు తీపినే మిగల్చడం విశేషం. ఎలాగంటే 2014 సాధారణ ఎన్నికల తర్వాత డిల్లీ, బీహర్‌లో భాజపాకు ప్రతికూలంగా రావడం. 
 
పెద్ద నోట్ల రద్దుతో ప్రతికూల పరిస్థితులు, ముఖ్యంగా రాజ్యసభలో మైనారిటీ ఇలా భాజపాకు ఇబ్బందిగా ఉన్న పరిస్థితులలో యూపి, ఉత్తరాఖండ్ ఫలితాలు మాత్రం కచ్చితంగా మంచి పరిణామంగా ఉంటాయి. 2014 సాధారణ ఎన్నికల తర్వాత కేరళతో సహ అన్నీ ప్రతికూల పరిస్థితులను కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఫలితం, గోవాలో ముందంజ. తాను 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మణిపూర్‌లో సైతం మంచి ఫలితాలు సాధించడం ఆ పార్టీకి మంచి ఊరట కల్పించే ఫలితమే అవుతుంది. ఆ రకంగా ఈ ఎన్నికలు రెండు జాతీయ పార్టీలకు తీపిని మిగల్చడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంతపురంలో జనసేనకు '0', పవన్ కళ్యాణ్ టెన్షన్... సర్వే లెక్క ఇలా వచ్చిందేంటి?