దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని కరోనా దవాఖానాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. ముంబైలోని భాండవ్ లో ఉన్న ఓ కరోనా ఆసుపత్రిలో ఈ ఘోరం జరిగింది. దాదాపు 70 మంది బాధితులను సిబ్బంది మరో ఆసుపత్రికి తరలించారు. మొత్తం 76 మంది భాండవ్‌లోని కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి తరలి వచ్చాయి. 23 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ముంబైలో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల సంఖ్యను పెంచారు. ఆసుపత్రులకు కరోనా బాధితుల తాకిడి పెరిగింది.
దవాఖానలో ఉన్న 70 మంది రోగులను మరో హాస్పిటల్‌కు తరలించామని ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ తెలిపారు. అందులో కరోనా బాధితులు కూడా ఉన్నారని వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ఈ మాల్‌లో దవాఖానను చూడటం ఇదే మొదటిసారి. నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.