హర్యానా రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మూడు రోజుల ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన రైతులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 13వ తేదీన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఏడు జిల్లాల్లో అంటే అంబాలా, కురుక్షేత్ర, కైథాల్ జింద్, హిస్సార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఈ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆదేశాలను పాటించాల్సిందిగా హర్యానా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం చేరవేశారు. అయితే, వ్యక్తిగత ఎస్ఎంఎస్, మొబైల్ రీచార్జ్, బ్యాంకింగ్ ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్, బ్రాడ్‌బ్యాండ్, కార్పొరేట్ - డొమెస్టిక్ లీజ్ లైన్స్‌కు మాత్రం మినహాయింపునిచ్చారు.
రైతులు పిలుపునిచ్చిన కార్యక్రమం వల్ల ఏడు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఏజీడీపీ, సీఐడీ హర్యానా తన దృష్టికి తీసుకువచ్చినట్లు హర్యానా సంయుక్త కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియా ద్వారా పుకార్ల వ్యాప్తిని నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎమ్), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎమ్ఎమ్) వంటి 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఛల్లో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. గత కొంత కాలంగా కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలని, రైతులకు పింఛను, పంటబీమా, 2020 ఆందోళనల్లో రైతులపై పెట్టిన కేసులు కొట్టివేయాలని డిమాండ్ చేస్తూ హర్యానా, పంజాబ్ రైతులు నిరసన చేస్తున్నారు.