Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మ జీవించి వుంటే ఇంత దమ్ము ఉండేదా? ఇప్పటికీ నేనే సీఎస్ : రామ్మోహన్ రావు గర్జన

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్నట్టయితే ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఇంత దమ్ము ఉండేదా అని తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ''పురచ

అమ్మ జీవించి వుంటే ఇంత దమ్ము ఉండేదా? ఇప్పటికీ నేనే సీఎస్ : రామ్మోహన్ రావు గర్జన
, మంగళవారం, 27 డిశెంబరు 2016 (12:09 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవించివున్నట్టయితే ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఇంత దమ్ము ఉండేదా అని తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ''పురచ్చితలైవి అమ్మ నన్ను నియమించారు.. ఇప్పటికీ నేనే చీఫ్ సెక్రటరీని. నన్ను బదిలీ చేస్తూ ఇంతవరకు ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. అమ్మే బతికుంటే ఇలా జరిగేదా.. అసలు చీఫ్ సెక్రటరీ ఇంటిమీద, ఆఫీసులో ప్రవేశించడానికి వాళ్లకు ఎంత ధైర్యం'' అంటూ మండిపడ్డారు. 
 
ఈనెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు సీఆర్పీఎఫ్ భద్రతతో ఆదాయపన్ను అధికారులు ఆయన ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లపై దాడిచేసి పెద్దమొత్తంలో నగలు, నగదు, పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇసుక కాంట్రాక్టర్ జే.శేఖర్ రెడ్డితో తనకు సంబంధం లేదని, ఆయనతో తాను ఎలాంటి లావాదేవీలు జరపలేదని అన్నారు. సచివాలయంలోని చీఫ్ సెక్రటరీ కార్యాలయం మీద జరిగిన దాడి రాజ్యాంగ వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ ప్రభుత్వానికి తనను బదిలీ చేసే దమ్ములేదన్నారు. తనను పురచ్చితలైవి అమ్మ అపాయింట్ చేశారని, ఇప్పటికీ తానే చీఫ్ సెక్రటరీనని గర్జించారు. ఇప్పటివరకు తనకు బదిలీ ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని, అందువల్ల ఇప్పుడు ఉన్న ఆమె ఇన్‌చార్జి అయి ఉంటారని చెప్పారు.
 
ఆదాయపన్ను శాఖ అధికారులకు తన ఇంట్లో కేవలం రూ.1,12,322 నగదు మాత్రమే దొరికిందని అన్నారు. తన కూతురు, భార్యకు సంబంధించిన 42 కాసుల బంగారం ఉందని, దాంతోపాటు వెండితో చేసిన మహాలక్ష్మి, వెంకటేశ్వరుడు, వినాయకుడి బొమ్మలలాంటివి 25 కిలోలు దొరికాయని తెలిపారు. అసలు తన ఇంట్లో, కార్యాలయంలో సోదాలకు వాళ్లు ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నారో లేదో తెలియదన్నారు. తన కార్యాలయంలో కూడా మంత్రులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల మీద క్రిమినల్ ఆరోపణలు ఏమీ వాళ్లకు దొరకలేదని, కేవలం కొంతమంది ప్రజలిచ్చిన వినతిపత్రాలే ఉన్నాయన్నారు. 
 
జయలలితే బతికుంటే అసలు వాళ్లకు తన ఆఫీసులో ప్రవేశించే ధైర్యం ఉండేదా అని నిలదీశారు. చీఫ్ సెక్రటరీ చాంబర్లోకి వెళ్లడానికి సీఆర్పీఎఫ్ ఎవరి అనుమతి తీసుకుందని.. ముఖ్యమంత్రి అనుమతి తీసుకున్నారా అని అడిగారు. ఒక చీఫ్ సెక్రటరీ పరిస్థితే ఇలావుంటే.. ఇక అన్నాడీఎంకే కార్యకర్తల గతేంటని అన్నారు. అమ్మ బతికుంటే ఇలా జరిగుండేది కాదని, ఇప్పుడు తమిళనాడు ప్రజల భద్రత మాటేంటని అన్నారు. 
 
తను 75 రోజుల పాటు ఆమె ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చానని, ఆమె మరణించిన తర్వాత తుపాను వస్తే, ఆ సమయంలో కూడా తానే బాధ్యతలు చూసుకున్నానని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఎవరికీ భద్రత లేదని చెప్పారు. తమిళనాడులో మిలటరీ, సీఆర్పీఎఫ్ ప్రవేశించి ఏమైనా చేయగలవని, వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం అంటే గౌరవం లేదని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రావెల్స్ బస్సుల వివాదం: ఆధారాలతో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. అరెస్ట్ చేసిన పోలీసులు