భారత్ మరోమారు సరికొత్త అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించినట్టు కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఆయుధ వ్యవస్థను డీఆర్డీవో అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు.
ఇదే విషయంపై ఆయన స్పందిస్తూ, 'సమీకృత గగనతల రక్షణ వ్యవస్థను 23వ తేదీ అర్థరాత్రి ఒడిశా తీరం నుంచి డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఐఏడీడబ్ల్యూఎస్ అనేది బహుళ అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. దీనిలో భారత్‌లో అభివృద్ధి చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (క్యూఆర్ఎస్ఏఎం), అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (వీఎస్‌హెచ్ఓఆర్ఏడీఎస్) మిసైల్స్, హైపవర్ లేజర్ ఆధారిత డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ (డీఈడబ్ల్యూ) ఉన్నాయి. ఐఏడీడబ్ల్యూను విజయవంతంగా అభివృద్ధి చేసినందుకు డీఆర్డీవో(డీఆర్డీవో), సైనిక దళాలను నేను అభినందిస్తున్నాను.
ఈ ప్రత్యేకమైన పరీక్ష బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని తెలియజేసింది. శత్రువులు ప్రయోగించే గగనతల ఆయుధాల నుంచి ఆయా ప్రాంతాల రక్షణను ఇది బలోపేతం చేయనుంది అని ఎక్స్‌లో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోస్టు చేశారు. ఆగస్టు 15న సుదర్శన చక్ర రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఈ ఎయిర్ డిఫెన్స్‌ను పరీక్షించడం విశేషం.
ఇటీవలే భారత్ మధ్యమ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగంలో ఆ క్షిపణి అన్ని సాంకేతిక, కార్యనిర్వాహక ప్రమాణాలను అందుకొని లక్ష్యాన్ని ఛేదించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేస్తున్న ఈ క్షిపణి పరిధి 5 వేల కిలోమీటర్లు. ఒకేసారి మూడు అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లి.. ఫైర్ చేసే సామర్థ్యం దీనికి ఉంది.