కేంద్ర వైద్య శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. డాక్టర్లపై ఎవరైనా దాడులకు పాల్పడితే ఇకపై ఫైన్ పడేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోగులు మరణిస్తే, వారి బంధువులు డాక్టర్లపై దాడికి దిగుతున్న ఘటనలు అధికమవుతున్నాయి. ఇదే అంశమై వైద్యులంతా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.
ప్రాణం పోసే డాక్టర్లపై దాడులకు పాల్పడటం, అలాగే ఆస్పత్రులను ధ్వంసం చేయడం సరికాదని వారు నిరసన వ్యక్తం చేయడంతో పాటు ధర్నాలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఇకపై డాక్టర్లపై దాడులకు పాల్పడితే, వారికి జైలు శిక్షతోపాటు భారీ మొత్తంలో ఫైన్ విధించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఇందుకు సంబంధించిన మసాయిదా బిల్లును రూపొందించింది.
ఆస్పత్రులలో విధులు నిర్వహిస్తున్న వైద్యులపై దాడి చేసిన వారిపై మూడు నుంచి పది సంవత్సరాల వరకూ జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ముసాయిదా బిల్లు రూపొందించింది. ఈ ముసాయిదాను ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం త్వరలో వెల్లడించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మంగళవారం వెల్లడించారు.
ఆస్పత్రుల్లో రోగుల బంధువులు హింసకు పాల్పడినా, విధ్వంసానికి పాల్పడినా నిందితులకు ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల జైలుశిక్షతోపాటు రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించాలని.. అలాగే ఈ దాడులలో ధ్వంసమైన ఆస్పత్రి ఆస్తి విలువకు రెండు రెట్లు పరిహారం చెల్లించాలన్న నిబంధనను కూడా ముసాయిదాలో చేర్చినట్లు సమాచారం.
ఆస్పత్రులలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లపై దాడులు జరగకుండా ఆపాలంటూ డాక్టర్ల నుంచి సుదీర్ఘ కాలంగా డిమాండ్ వస్తోందని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు.