ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోనే దాదాపు 50శాతం మద్యం వినియోగిస్తున్నారనీ, పన్నుల ద్వారా ఈ రాష్ట్రాలకు 10 నుంచి 15శాతం వరకు ఆదాయం వస్తున్నట్టు క్రిజిల్ రిపోర్టు వెల్లడించింది.
యావత్ దేశం మద్యం వినియోగంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వాటా 45 శాతంగా ఉన్నట్టు ఆ రిపోర్టు వెల్లడించింది. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు 15 శాతం ఆదాయంతో అగ్రభాగాన ఉన్నాయి.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లు చెరి 11శాతం, తెలంగాణ 10శాతం ఆదాయం పొందుతున్నాయని ఆ రిపోర్టు వెల్లడించింది. మద్యం ద్వారా వస్తోన్న ఆదాయంలో 12 శాతంతో ఢిల్లీ దేశంలో మూడోస్థానంలో ఉంది. వినియోగంలో మాత్రం జాతీయ స్థాయిలో 4 శాతంగా ఉంది.
దేశంలో 13శాతం వినియోగం ఒక్క తమిళనాడులోనే ఉండగా, 12శాతంతో కర్ణాటక, తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ (7శాతం), తెలంగాణ (6శాతం), కేరళ (5శాతం)ఉన్నాయి. 3.3 కోట్ల జనాభా ఉన్న కేరళ మద్యం విక్రయాలపై ఎక్కువ పన్నులతో అత్యధిక ఆదాయాన్ని పొందుతోంది.
దేశవ్యాప్తంగా ఐదు దక్షిణాది రాష్ట్రాలతో కలిపి, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ సహా 12 రాష్ట్రాలు 75శాతం మద్యాన్ని వినియోగిస్తున్నాయి. ఈ 12 రాష్ట్రాల్లోనే కోవిడ్ కేసులూ, మరణాలూ 85 శాతానికి పైగా ఉండడం గమనార్హం.