తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా ప్రధాన పార్టీలు వరాల జల్లు కరుపిస్తున్నాయి. ముఖ్యంగా, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ ఎన్నికల కోసం తమ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇందులో ప్రతి ఒక్కరిపైనా వరాల వర్షం కురిపించారు. ముఖ్యంగా, గ్యాస్ సిలిండర్‌కు రూ.100 సబ్సిడీ. లీటర్ పెట్రోలుపై రూ.5, డీజిల్‌పై రూ.4 తగ్గింపు, రేషన్‌కార్డుదారులందరికీ రూ.4 వేలు కరోనా సాయం, మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాది పాటు ప్రసూతి సెలవులు ఇలా అనేక వరాలు కురిపించారు.
అంతేకాకుండా, తాము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు తమిళులకే ఇచ్చేలా చట్టం రూపొందిస్తామని స్టాలిన్ ప్రకటించారు. రేషన్‌కార్డుదారులందరికీ కరోనా సాయంగా రూ.4వేలు ఇస్తామని ప్రకటించారు.
8వ తరగతి వరకు నిర్బంధ తమిళం అమలు చేస్తామన్నారు. తిరుక్కురుళ్ను జాతీయ గ్రంథంగా ప్రకటించేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తామని, దివంగత ముఖ్యమంత్రి కలైంజర్(కరుణానిధి) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 500 భోజనశాలలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్త పర్యటనలో తనకు ప్రజల నుంచి వచ్చిన వినతులను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడతామని, జాతీయ నీట్ పరీక్షలు రద్దు చేస్తామని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు వివాదాస్పద సాగుచట్టాలను అమలు చేయబోమని వెల్లడించారు.
గ్యాస్ సిలిండర్‌కు రూ.100 సబ్సిడీ చెల్లిస్తామని, లీటరు పెట్రోల్‌కు రూ.5, డీజిల్‌కు రూ.4 చొప్పున తగ్గిస్తామని, ఆవిన్ పాల ధరను లీటర్‌కు రూ.3 దాకా తగ్గిస్తామని తెలిపారు. రేషన్ షాపుల్లో మళ్లీ చౌకధరకు మినప్పప్పు, అదనంగా కేజీ చక్కెర ఇస్తామన్నారు.
వృద్ధాప్య పింఛన్ రూ.1500కు పెంచుతామని, వితంతువులు, 50 ఏళ్లు దాటిన అవివాహితులు, దివ్యాంగ మహిళలు, శ్రీలంక శరణార్థులకూ రూ.1500 పింఛన్ ఇస్తామని తెలిపారు. వరికి మద్దతు ధర రూ.2,500 ఇస్తామని, జల్లికట్టు ఎద్దులను పెంచేందుకు ప్రతినెలా రూ.1,000 ఇస్తామన్నారు.
పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం పాలు పంపిణీ చేస్తామని, విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ నేప్కిన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు 30 నుంచి 40 శాతానికి పెంచుతామన్నారు
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై జరుగుతున్న ప్రభుత్వ విచారణను వేగవంతంగా చేసి, కారకులపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సముద్రతీర ప్రాంతాల్లో నిర్లవణీకరణ పథకాల అమలు చేస్తామన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు.