పెద్ద నోట్లు రద్దు చేసి మంచి చేశారు.. చాలా హ్యాపీగా ఉన్నాం : మోడీకి కాశ్మీర్ ముస్లింల లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాశ్మీర్ ముస్లింలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశంసలు ఎందుకో తెలుసా... పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దు చేయడమే. వాస్తవానికి ఈ నోట్ల రద్దుతో దేశ ప్రజలు అష్టకష్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాశ్మీర్ ముస్లింలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ప్రశంసలు ఎందుకో తెలుసా... పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల రద్దు చేయడమే. వాస్తవానికి ఈ నోట్ల రద్దుతో దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కానీ కాశ్మీర్ ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీని ప్రశంసిస్తూ.. అఫ్జల్ రెహ్మాన్ అనే యువకుడు ముస్లింల తరపున ఒకడు ప్రత్యేకంగా లేఖ రాశాడు.
ఇందులో నరేంద్ర మోడీ చర్యతో కాశ్మీర్ ప్రజల జీవితం ఒక్కసారిగా మారిపోయిందంటూ అఫ్జల్ రెహమాన్ ప్రధానికి లేఖ రాశారు. పాత రూ.1000, రూ.500 నోట్లు చెలామణి కాకపోవడంతో గత పది రోజులుగా కాశ్మీర్‌లో రాళ్ళ దాడులు ఆగిపోయాయి. డబ్బుల కోసం తనకు తెలియకుండానే తన కుమారుడు కూడా రాళ్ళ దాడుల్లో పాల్గొని గాయపడినట్లు వివరించారు. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడటంతో రోడ్లపై ట్రాఫిక్ పెరిగిందని, షాపులు తిరిగి తెరచుకుంటున్నాయన్నారు. వేర్పాటువాదులు, భద్రతా సిబ్బంది మధ్య నలిగిపోయి చీకటి గదుల్లోనే గడిపిన కాశ్మీర్ వాసులు ఇప్పుడు స్వేచ్ఛగా ఇళ్ళ నుంచి బయటకు వస్తున్నారని ఆయన హర్షం వ్యక్తంచేశారు.
దేశంలోని పలు చోట్ల ప్రజలు నగదు కోసం బ్యాంకుల వద్ద బారులు తీరి ఇబ్బందులు పడుతున్నా, తాము మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్లు అఫ్జల్ రెహ్మాన్ వివరించారు. ఇప్పటివరకు ఇళ్లకే పరిమితమైన కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు క్యూలైన్లలో నిల్చోని మనసు విప్పి తోటి వారితో మాట్లాడుకుంటున్నారని ఆయన తెలిపారు. మూడు నెలలుగా మూత పడిన స్కూళ్ళు కూడా తిరిగి తెరచుకున్నాయని, ఇటీవల జరిగిన 12వ తరగతి బోర్డు పరీక్షల్లో తన కుమార్తె బాగా రాసిందని, విద్యార్థుల హాజరు శాతం 95కు పైగా నమోదైందన్నారు. పెద్ద నోట్ల రద్దుతోనే ఇదంతా జరిగినట్లు తాము భావిస్తున్నామని, అందుకు కృతజ్ఞతగా ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నట్లు అఫ్జల్ రెహమాన్ అందులో పేర్కొన్నారు. ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, జులై 8న హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానిని భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ చేశాయి. వేర్పాటువాదుల పిలుపుతో నాటి నుంచి మూడు నెలలకుపైగా జమ్మూకాశ్మీర్ అల్లర్లతో రగిలిపోయింది. ముస్లిం యువత రాళ్ళ దాడులు, సెక్యూరిటీ సిబ్బంది ప్రతి కాల్పుల్లో వంద మందికిపైగా మృతి చెందగా వేలదిగా గాయపడిన విషయం తెల్సిందే.