కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ పై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శలు చేశారు. మోడీ సర్కారు ప్రజాస్వామ్యబద్దంగా గెలుపొందిన వ్యవస్థలను కూల్చడమే పనిగా పెట్టుకుందని రాహుల్ మండిపడ్డారు. తూత్తుకూడిలోని వీవోసి కాలేజీలో న్యాయవాదులతో సమావేశమైన రాహుల్.. మోడీ ప్రభుత్వంలో గత ఆరేళ్ళుగా ప్రజాస్వామ్యం కూనీ అవుతున్నదని ఆరోపించారు.
ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నదని విమర్శించారు. అదేవిధంగా న్యాయవ్యవస్థలో, పార్లమెంటులో మహిళలకు రిజర్వేషన్‌లు కల్పిస్తే తన పూర్తి మద్దతు ఉంటుందని రాహుల్‌గాంధీ చెప్పారు. ప్రధాని తీరు సరిగాలేదన్న ఆయన.. ఇక్కడ ప్రధాని పనికొచ్చేవాడా, పనికిరానివాడా అన్నది ప్రశ్న కాదని.. ఆయన ఎవరికి పనికొస్తాడు అనేది అసలు ప్రశ్న అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు.
ప్రధాని కేవలం ఇద్దరు వ్యక్తులకే బాగా పనికొస్తాడని, మేమిస్తాం.. మాకు ఇవ్వండి అన్న రీతిలో వారి బంధం సాగుతున్నదని ఆయన విమర్శించారు. కుబేరులకు సంపద పెంచుకోవడానికి తప్ప, పేదలకు ప్రధాని ఏవిధంగానూ పనికిరాడని రాహుల్ దెప్పిపొడిచారు.