ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాలేజీ విద్యార్థినిపై ఓ దుర్మార్గుడు యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె చేతులకు కాలిన గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. ఆదివారం స్పెషల్ క్లాస్ కోసం కాలేజీకి నడుచుకుంటూ వెళ్తుండగా, మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను అడ్డుకుని.. యాసిడ్‌తో దాడి చేశారు.
ఆమె తన ముఖాన్ని కాపాడుకునేందుకు చేతులు అడ్డుపెట్టడంతో, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం నిందితులు ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని వెంటనే సమీపంలోని దీప్ చంద్ బంధు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాథమిక విచారణలో జితేందర్ అనే యువకుడు గత కొన్ని నెలలుగా యువతిని వెంబడిస్తూ వేధిస్తున్నట్లు తేలింది. అతని వేధింపులను తట్టుకోలేక.. తిరగబడినట్ల తెలుస్తోంది. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, తన సోదరి పరిస్థితి విషమంగా ఉందని, ఆమె శరీరంలోని పలు భాగాల్లో కాలిన గాయాలయ్యాయని బాధితురాలి సోదరుడు మీడియాకు తెలిపారు.