కేరళలో తొలి మంకీపాక్స్ మరణం నమోదైంది. తాజాగా ఢిల్లీలో రెండో మంకీ పాక్స్ కేసు వెలుగు చూసింది. ఢిల్లీలో నివసిస్తున్న 35 ఏళ్ల నైజీరియన్ మంకీ పాక్స్ బారిన పడ్డాడు. ఇటీవల అతను విదేశీ ప్రయాణాలు ఏమీ చేయలేదని తెలిసింది.
ఫలితంగా దేశంలో మంకీ పాక్స్ బారిన పడినవారి సంఖ్య ఆరుకు చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మంకీ పాక్స్ లక్షణాలు సోకిన నైజీరియన్ ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
గత ఐదు రోజులుగా జ్వరం, బొబ్బలతో బాధపడుతున్నాడు. అతని వద్ద నుంచి సేకరించిన రక్త నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)కి పంపారు. అతడికి మంకీ పాక్స్ సోకినట్లు సోమవారం రిపోర్టు వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి.