Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెండాకుల చిహ్నం కేసు: పోలీసుల ఉచ్చులో మంత్రులు, ఐజీలు, ఐపీఎస్‌లు.. ఎవరన్నదే సస్పెన్స్

దేశంలో ఏ పార్టీ కూడా బరితెగించని విధంగా కేంద్ర ఎన్నికల సంఘానికే ముడుపులు ఇచ్చి రెండాకుల చిహ్నం సంపాదించి ఆపై ముఖ్యమంత్రి అయిపోదామని మహాకుట్రకు పాల్పడిన శశికళ మేనల్లుడు దినకరన్ అడ్డంగా దొరికిపోయిన తర్వాత అతడికి సహకరించిన మంత్రులు, ఐజీలూ, ఐపీఎస్‌ల పని

రెండాకుల చిహ్నం కేసు: పోలీసుల ఉచ్చులో మంత్రులు, ఐజీలు, ఐపీఎస్‌లు.. ఎవరన్నదే సస్పెన్స్
హైదరాబాద్ , ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (05:30 IST)
ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి అసలు సమస్య పాలన కాదు, కరువు నివారణ కాదు. ఏఐడీఎంకే ఇరువర్గాల విలీన చర్చలు కాదు. మంత్రివర్గంలో ఎవరిని తదుపరి అరెస్టు చేసి డిల్లీ తీసుకెళతారన్నది అసలు సమస్య. దేశంలో ఏ పార్టీ కూడా బరితెగించని విధంగా కేంద్ర ఎన్నికల సంఘానికే ముడుపులు ఇచ్చి రెండాకుల చిహ్నం సంపాదించి ఆపై ముఖ్యమంత్రి అయిపోదామని మహాకుట్రకు పాల్పడిన శశికళ మేనల్లుడు దినకరన్ అడ్డంగా దొరికిపోయిన తర్వాత అతడికి సహకరించిన మంత్రులు, ఐజీలూ, ఐపీఎస్‌ల పని పట్టడానికి ఢిల్లీ పోలీసులు సిద్ధం కావడంతో పళనిస్వామి కేబినెట్ లోని మంత్రులు, తమిళనాడు ఐజీలు ఐపీఎస్ అధికారులు హడలిపోతున్నారు. చెన్నై చుట్టూ మూడు రోజులు సాగిన విచారణలో పలువురు మంత్రుల ప్రమేయం వెలుగులోకి వచ్చిన సమాచారంతో సీఎం పళనిస్వామి కేబినెట్‌లో ఆందోళన నెలకొంది.
 
రెండాకుల చిహ్నం కైవసం లక్ష్యంగా ఎన్నికల యంత్రాంగానికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన కేసులో అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ వద్ద చెన్నైలో మూడు రోజులుగా ఢిల్లీ పోలీసులు విచారించారు. శుక్రవారం అర్ధరాత్రి విచారణ ప్యారిస్, పెరంబూరు చుట్టు›సాగి ఉండడంతో, అక్కడ దినకరన్‌కు సన్నిహితులు ఎవరు ఉన్నారో అని ఆరా తీయాల్సిన పరిస్థితి. విచారణలో వెలుగు చూసిన చిరునామాల్లో తాము ఎవరి కోసం వచ్చామో ఆ వ్యక్తులు లేకపోవడం ఢిల్లీ పోలీసుల్లో అనుమానాలు బయలు దేరాయి.
 
తాము అనుమానిస్తున్న ఆదంబాక్కం మోహన్, కొలపాక్కం ఫిలిప్స్‌ డేనియల్, తిరువేర్కాడు గోపినాథ్‌లను విచారణ నిమిత్తం ఢిల్లీకి పిలుస్తూ పోలీసులు సమన్లు జారీ చేశారు. 16 మందిలో ఐదుగురిపై గురిపెట్టి చెన్నైలో విచారణ జరగ్గా, మిగిలిన వారిలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు అదనపు డీజీపీ, ఒక ఐజీ స్థాయి అధికారి ఉండడంతో వాళ్లెవరోనని ఆరా తీసే వాళ్లు పెరిగారు. మంత్రుల పేర్లు ఢిల్లీ పోలీసుల జాబితాలో ఉన్న సమాచారం సీఎం పళనిస్వామి కేబినెట్‌లో గుబులు రేపింది. శనివారం పలువురు మంత్రులు ఎక్కడ తమను ఢిల్లీ పోలీసులు విచారణ పేరిట పిలిపిస్తారోనన్న భయంతో సొంత జిల్లాల బాట పట్టడం గమనించాల్సిన విషయం.
 
ఈ మూడు రోజుల విచారణలో ఢిల్లీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కాయో, అందులో ఏ మంత్రి పేరు ఉందో అన్న చర్చ అన్నాడీఎంకేలో ఊపందుకుంది. మంత్రుల్ని, ఐపీఎస్‌లను విచారించ దలచిన పక్షంలో కేసు సీబీఐకు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు వెలువడడంతో రెండాకుల వ్యవహారంలో తదుపరి టార్గెట్‌ ఎవరో అన్న ఆందోళన బయలు దేరింది.
 
ఇద్దరు మంత్రులు నగదు సమకూర్చడంలో సహకరించినట్టు, ముగ్గురు ఐపీఎస్‌లు ఢిల్లీకి చేరవేయడం ముఖ్య పాత్ర పోషించినట్టుగా ప్రచారం సాగుతుండడంతో, దినకరన్‌కు తోడుగా ఢిల్లీ వెళ్లబోయేదెవ్వరోనన్న ఉత్కంఠ తప్పడం లేదు. ఢిల్లీలో లంచం పుచ్చుకునేందుకు ప్రయత్నించిన ఎన్నికల అధికారులు ఎవరోనన్న విషయాన్ని బయటకు లాగే రీతిలో విచారణ సాగుతున్నట్టు సమాచారం.

ఈ పరిణామాలన్నింటి తర్వాత కేంద్రం కన్నెర్ర చేస్తే ప్రభుత్వమే రద్దయ్యే అవకాశం పొంచి ఉండటంతో తమిళనాడు రాజకీయాలు కనీ వినీ ఎరుగని సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోరికల 'తృప్తి' కోసమే భార్యలకు అలా చెప్పేస్తున్నారు... యోగీ ఆదిత్యనాథ్ మంత్రి మాట...