ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మొన్నటికిమొన్న బీజేపీ ఎంపీ రాం స్వరూప్ శర్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఇపుడు మరో సీనియర్ నేత ప్రాణాలు తీసుకున్నారు. ఈ వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి.
దక్షిణ ఢిల్లీ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడైన జీఎస్ బావా తన ఇంటి సమీపంలోని పార్క్‌లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యల వల్లే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలుస్తుండగా, ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కాగా, 58 ఏళ్ల బావా పశ్చిమ ఢిల్లీలోని ఫతేనగర్‌లో నివసిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో పార్కులోని చెట్టుకు విగతజీవిగా వేలాడుతుండడాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆయనను బీజేపీ నేత జీఎస్ బావాగా గుర్తించారు. ఆయన వద్ద నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.