అవును.. పెన్షన్ల కోసం ఉత్తరప్రదేశ్‌లో మహిళలు భర్తలను చంపేస్తున్నారట. ఎలాగంటే..? యూపీలో భర్త ప్రాణాలతో వుండగానే కొందరు మహిళలు వితంతువులకు ఇచ్చే పెన్షన్ తీసుకుంటున్నారు. భర్తలను కోల్పోయిన వితంతువులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భర్త ప్రాణాలతో వున్నప్పటికీ.. ఆయన మరణించినట్లు చెప్పి.. పెన్షన్లు తీసుకునే మహిళల సంఖ్య పెరిగిపోయిందని తేలింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, సీతాపూర్ జిల్లాకు చెందిన సందీప్ కుమార్ సతీమణి సెల్‌ఫోన్‌కు.. ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఆమె అకౌంట్‌కు మూడు వేల రూపాయలు జమచేసినట్లు వుంది. ఈ మూడు వేలు ఎలా వచ్చిందని ఆరా తీసిన సందీప్ కుమార్.. దీనిపై బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకున్నాడు. ఇది వితంతువులకు ఇచ్చే పెన్షన్ డబ్బు అని వారు వివరణ ఇవ్వడంతో షాక్ తిన్నాడు.
భర్త తాను ప్రాణాలతో వుండగా వితంతు పెన్షన్ ఎలా వచ్చిందని భార్యను నిలదీశాడు. తర్వాతే తెలిసింది.. సందీప్ భార్యే కాకుండా.. ఆ గ్రామానికి చెందిన 22 మంది మహిళలు.. భర్తలు బతికి వున్నప్పటికీ.. చనిపోయాడని నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి.. పెన్షన్ తీసుకున్నట్లు తేలింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.