బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇండియాలో సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అమితాబ్ బచ్చన్ ని వరించింది. కొన్ని వారాల క్రితం అమితాబ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా ఆదివారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అమితాబ్ రాష్ట్రపతి భవన్ లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ తన సంతోషాన్ని తెలియజేశారు. భారత ప్రభుత్వం అందించిన ఈ అవార్డుని తాను భాద్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, అభిమానుల ఆదరణ, తన దర్శకనిర్మాతల సహకారం వల్లే తాను ఈ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగానని అమితాబ్ అన్నారు.
ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పేరిట ప్రభుత్వం ప్రతి ఏడాది ఒకరిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ఆశా బోస్లే, లతా మంగేష్కర్, రాజ్ కపూర్, బాలచందర్ లాంటి సినీ దిగ్గజాలు ఈ అవార్డుని అందుకున్నారు.
తెలుగులో ఇప్పటి వరకు బిఎన్ రెడ్డి, ఎల్వి ప్రసాద్, ఏఎన్నార్, రామానాయుడు, కె విశ్వనాథ్ లాంటి టాలీవుడ్ దిగ్గజాలు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని మొట్టమొదట 1969లో ప్రారంభించారు. హిందీ నటి దేవిక రాణి మొదటి అవార్డుని సొంతం చేసుకున్నారు.