ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఓ పులి అటవీ ప్రాంతాన్ని వీడి జనసంచారంలోకి వచ్చింది. ఈ పులి మూడు రోజుల వ్యవధిలో ముగ్గురుని చంపి ఆరగించింది. ఈ పులిని పట్టుకునేందుకు ఆ రాష్ట్ర అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో 25 గ్రామాల్లో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. మంగవారం వరకు పాఠశాలలకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. ఈ పులిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన 25 గ్రామాల్లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.
కార్బెట్ టైగర్ రిజర్వుకు సమీపంలోని సిమ్లీ గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న రణ్‌వీర్ సింగ్ నేగికి డెహ్రాడూన్‌లోని బంధువులు శనివారం నుంచి ఫోన్ చేస్తున్నా స్పందించడం లేదు. దీంతో గ్రామంలోని తెలిసినవారికి ఫోన్ చేసి ఇంటికెళ్లి చూడాలని కోరారు. ఆదివారం వారు ఆయన ఇంటికి వెళ్తున్నపుడు దారిలో రక్తపు మరకలు కనిపించాయి.
దీంతో వారు ఆయన కోసం గాలించగా ఇంటికి కొద్ది దూరంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. నేగిపై దాడిచేసిన పులి అతడిని చంపి సగం తిని వదిలేసి వెళ్లిపోయిందని, గ్రామస్థులు ఈ విషయాన్ని వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలిపారు. ఇలా మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడంతో జనం వణికిపోతున్నారు.
మరోవైపు, పులిని బంధించేందుకు రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు గ్రామంలో బోను ఏర్పాటు చేశారు. పశువుల మేత కోసం గ్రామస్థులు అడవిలోకి వెళ్లొద్దని కోరారు. కాగా, ఈ పులిని మనుషుల్ని వేటాడే జంతువుగా ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మరోవైపు పులల దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు.