జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక సిఆర్‌పిఎఫ్ వాహనం లోతైన గుంతలో పడి కనీసం ముగ్గురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. వారిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బసంత్‌గఢ్ ప్రాంతంలోని కాండ్వా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారని, గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించామని ఉధంపూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సందీప్ భట్ తెలిపారు. వాహనం వందల అడుగుల కిందకు పడిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందులో ఉన్న కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉధంపూర్ డిసితో మాట్లాడానని, గాయపడిన జవాన్లకు అన్ని విధాలా సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఉదంపూర్ కాండ్వా-బసంత్‌గఢ్ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైందనే వార్త విని తాను బాధపడ్డానని జితేంద్ర సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.