2000 రూపాయల కరెన్సీ నోటును రద్దు చేయడంపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.2000 నోట్లపై నిషేధం విధించకుండా మార్పిడికి అనుమతించడమే అతిపెద్ద కుంభకోణమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో నోట్ల రద్దు ప్రకటించినప్పుడు సామాన్యులు ఇబ్బందులు పడ్డారన్నారు.
కార్పొరేట్ కంపెనీలు, ధనవంతులు వేల కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు వీలుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నోట్లను రద్దు చేశారని గుర్తు చేశారు.
అనంతరం చెలామణీలోకి రెండు వేల రూపాయలను తీసుకొచ్చారని.. వాటిని నిషేధించకుండా మార్చుకునే అవకాశం ఇవ్వడంతో ధనవంతులకే మేలు జరుగుతుందని నారాయణ విమర్శలు గుప్పించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రూ.2000 కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ నోట్లను కలిగి ఉన్న వ్యక్తులు సెప్టెంబరు 30లోగా వాటిని తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు లేదా ఇతర విలువలతో మార్చుకోవచ్చు.