సంచలనం రేపిన షీనా బోరా హత్యకేసులో మరో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా మరోసారి వార్తల్లో నిలిచింది.
చనిపోయిందని భావిస్తున్న తన కూతురు షీనా బోరా బతికే ఉందంటూ (జనవరి 24, సోమవారం) ముంబైలోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఒక రాతపూర్వక దరఖాస్తును లాయర్ ద్వారా కోర్టుకు సమర్పించింది.
ఈ దరఖాస్తు కాపీని సీబీఐకి అందజేసిన కోర్టు. ఫిబ్రవరి 4వ తేదీన తన ప్రతిస్పందన ఫైల్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి తెలియజేసినా ఎలాంటి స్పందన లేదని ఆరోపించింది.
తాను రాసిన లేఖపై సీబీఐ ఎలాంటి చర్య తీసుకుందో తెలుసుకోవాలని ఇంద్రాణి కోర్టును కోరింది. బోరా ఖచ్చితంగా బతికే ఉంది అనేందుకు తన వద్ద బలమైన కారణం ఉందని తెలిపింది.
జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఇంద్రాణి తనకు సత్వరమే న్యాయం చేయాలని కోరింది. కాగా తన కూతురు షీనా బోరా బతికే ఉందంటూ గత ఏడాది డిసెంబరులో ఇంద్రాణి సీబీఐ డైరెక్టర్‌కు ఒక లేఖ రాసింది. దీనిపై దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేసింది.