వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌కి విధించిన డెడ్‌లైన్ ముగిసింది. ఈ నెల 23వ తేదీ లోపు ముస్సోరిలోని ఐఏఎస్ శిక్షణా కేంద్రంలో రిపోర్టు చేయాలని జారీ చేసిన ఆదేశాలను ఆమె పాటించలేదు. దీంతో ఆమెకు విధించిన గడువు ముగిసిపోయింది.
నకిలీ వికలాంగ ధృవీకణ, కుల ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె ఎంపిక చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ట్రైనింగ్‌ను కేంద్రం నిలిపివేసింది. అదేసమయంలో ఈ నెల 23వ తేదీలోపు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అడ్మినిస్ట్రేషన్ అకాడెమీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ ఆమె ఆ ఆదేశాలను పట్టించుకోలేదు.
మరోవైపు, తన గుర్తింపునకు సంబంధించి తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఇంకోవైపు, పూజా ఖేద్కర్ సమర్పించిన డాక్యుమెంట్ల పరిశీలన కోసం కేంద్రం ఏకసభ్య కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.