దేవభూమిగా ప్రసిద్ధికెక్కిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జలప్రళయం సంభవించింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మికంగా భారీ వరద సంభవించింది. ఈ వరద నీటి ప్రవాహంలో ఏకంగా ఒక గ్రామమే కొట్టుకునిపోయింది. ఉత్తరకాశీలోని ధరాలీలో కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద బురదతో ఆ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. ఇప్పటికే నలుగురు మృత్యువాత పడగా, తాజాగా దాదాపు పది మంది సైనికులు వరదనీటిలో గల్లంతైనట్లు సమాచారం. వీరికోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
వరదకు తీవ్రంగా ప్రభావితమైన ధరాలీ గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఆర్మీ బేస్ క్యాంప్ ఉండటం గమనార్హం. హర్షిల్ ఆర్మీ క్యాంపస్‌కు దిగువన ఉన్న సైనికులు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయినట్లు సమాచారం. వారికోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ధరాలీ గ్రామంలో అడుగుల మేర బురద పేరుకుపోవడంతో సైన్యం రంగంలోకి దిగింది.
150 మంది సభ్యుల బృందం, ఎన్డీఆర్ఎఫ్‌తో కలిసి సహాయక చర్యలు చేపడుతోంది. ఒకవైపు తమ బృంద సభ్యులు గల్లంతైనప్పటికీ, నిరాటంకంగా సహాయక కార్యక్రమాలు సైన్యం కొనసాగిస్తోంది. అయితే ఎక్కడికక్కడ బురద మేటలు వేయడం, ఇళ్లు, దుకాణాలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.