కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గతో ఓ విచిత్ర వివాహం జరిగింది. ఒకే వేదికపై ఇద్దరు యువతులను ఓ యువకుడు వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరు యువతులను ఆ యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పైగా, ఈ పెళ్లిళ్లు ఆయా కుటుంబ సభ్యుల పూర్తి అంగీకారంతో ఈ వివాహం జరగడం మరో విశేషం.
చిత్రదుర్గ పట్టణంలోని జేజేహట్టి కాలనీకి చెందిన వసీం షేక్ (28) అనే యువకుడు ఇద్దరు యువతులతో ప్రేమాయణం నడిపాడు. సుమారు 13 ఏళ్ల క్రితం గోవాలో పనిచేస్తున్నప్పుడు షిఫా అనే యువతితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఆ తర్వాత ఏడేళ్ల క్రితం చిత్రదుర్గకు చెందిన జన్నత్ అనే యువతితో కూడా వసీంకు పరిచయమై, ఆమెతోనూ ప్రేమలో పడ్డాడు. ఇద్దరినీ ఇష్టపడిన వసీం, ఎవరినీ వదులుకోలేకపోయాడు.
ఈ క్రమంలో ఇద్దరినీ వివాహం చేసుకోవాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన మనసులోని మాటను ఇరువైపులా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మొదట ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత మూడు కుటుంబాల పెద్దలు కూర్చుని చర్చించుకుని ఈ పెళ్లికి అంగీకారం తెలిపారు. దీంతో బంధుమిత్రుల సమక్షంలో వసీం షేక్.. షిఫా, జన్నత్‌లను ఒకే వేదికపై వివాహం చేసుకున్నాడు.
ఈ నెల 15వ తేదీన స్థానిక ఎంకే ప్యాలెస్‌లో వీరి వివాహ రిసెప్షన్ (వలీమా) ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వసీం మీడియాతో మాట్లాడుతూ, 'షిఫా, జన్నత్ ఇద్దరిపై నాకు ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ. అందుకే ఇద్దరినీ పెళ్లి చేసుకున్నాను. మా వివాహాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు' అని స్పష్టం చేశాడు. ఈ అరుదైన పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.