ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టించుకున్నారు. ముఖ్యమంత్రి కొరడాతో కొట్టించుకోవడం ఏమిటి అనుకుంటున్నారా..? కానీ ఇది వాస్తవం. అయితే, బఘేల్ ఏదో సరదా కోసమో లేదంటే చేసిన తప్పునకు శిక్షగానో ఈ దెబ్బలు కొట్టించుకోలేదు. ఓ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అక్కడి సాంప్రదాయం ప్రకారం ఇలా చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్‌లో ప్రతి ఏడాది ఆడంబరంగా గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ తర్వాత భక్తులు కొరడాతో కొట్టించుకుంటారు. ఇలా గోవర్ధన్ పూజ అనంతరం కొరడా దెబ్బలు తింటే సమస్యలు తొలగిపోతాయని స్థానికుల నమ్మకం. ఈ క్రమంలోనే ఇవాళ దుర్గ్‌లోని జంజిగిరి గ్రామంలో గోవర్ధన్ పూజకు హాజరైన బఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు.
జంజిగిరి గ్రామానికి చెందిన బీరేంద్ర ఠాకూర్ సీఎం భూపేశ్ బఘేల్‌ను కొరడాతో కొట్టారు. ఆ తర్వాత బఘేల్ మాట్లాడుతూ.. గోవును పూజించే ఈ గోవర్ధన్ పూజా కార్యాక్రమం చాలా గొప్పసంప్రదాయం అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకుండా భావి తరాలకు అందజేయడం మనందరి బాధ్యత అన్నారు.