తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఓ మహిళా ఇన్‌స్పెక్టర్ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి భార్య వేధింపులే కారణమని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చెన్నై అన్నానగర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
చెన్నై నగర పోలీసు విభాగంలో సుచిత్రా దేవి (40) అనే మహిళ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తోంది. ఈమె అన్నా నగర్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లో పని చేస్తోంది. అయితే, ఈమెకు మొదటి భర్త అనారోగ్యం కారణంగా 2009లో చనిపోయాడు. మొదటి భర్త ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో 2012లో గోపీనాథఅ (35) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి లక్షణ (03) అనే కుమార్తె ఉంది.
ఈ నేపథ్యంలో సోమవారం భార్య సుచిత్రాదేవితో భర్త తన మొబైల్ ఫోనులో మాట్లాడారు. వారిద్దరి మధ్య ఫోనులో ఎలాంటి సంభాషణలు జరిగాయో తెలియదు కానీ, ఇంటికి వచ్చిన గోపీనాథ్ పడక గదికి నిద్రించేందుకు వెళ్లాడు. సుచిత్రాదేవి తలుపులు తట్టగా తెరచుకోలేదు.
తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న అన్నానగర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ఆసుపత్రికి పంపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మహిళా ఇన్‌స్పెక్టర్ సుచిత్రాదేవి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.